KCR: మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు: కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ

విద్యుత్‌ కొనుగోలు విషయంలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు వివరణ ఇచ్చారు.

Updated : 15 Jun 2024 14:48 IST

హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోలు విషయంలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. అన్ని రకాల చట్టాల నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్నారు. ఈ విషయం కూడా రేవంత్ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిటీ ఏర్పాటు చేశారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పారు. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయే పరిస్థితి ఉండేదని వివరించారు. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల హాలిడే ప్రకటించేవారని పేర్కొన్నారు.

‘‘విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంట్‌ ఏ మాత్రం సరిపోదు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడానికే కమిషన్‌ ఏర్పాటు చేశారు. మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చేసి చూపించేందుకే ప్రయత్నాలు. విలేకర్ల సమావేశంలో కమిషన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని వైదొలగితే మంచిది. మీరు కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా’’ అని కేసీఆర్‌ తెలిపారు.

తెలంగాణలో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి  ఇటీవల నోటీసులు ఇచ్చారు. జూన్‌ 15(నేడు) లోపు వివరణ ఇవ్వాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు