KCR: నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్
దేశ వ్యాప్తంగా భారాస (BRS) పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో మహారాష్ట్ర (Maharashtra) లోని నాందేడ్ (Nanded)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ (KCR) మాట్లాడారు. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయని ఆయన అన్నారు.
నాందేడ్: దేశ పరిస్థితులను చూసిన తర్వాత తెరాసను భారాస (BRS)గా మార్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీని దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో నాందేడ్ (Nanded)లోని సచ్‌ఖండ్ బోడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహారాష్ట్రలోని పలువురు నాయకులకు భారాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్, పూలే వంటి మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మహారాష్ట్రలో సభ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ, ఆ మేరకు మార్పులు రాలేదు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కనీసం తాగునీరు, విద్యుత్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినప్పటికీ ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే ‘అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో భారాస వచ్చింది. ఎన్నాళ్లో ఎదురు చూశాం. ఇప్పుడు సమయం వచ్చింది. నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి.’’ అని కేసీఆర్ అన్నారు.
రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం
ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదని, ప్రజలు, రైతులు గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘భారత్ పేద దేశం ఎంతమాత్రం కాదు. భారత్ అమెరికా కంటే ధనిక దేశం. భారత్‌లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ.. ప్రజలు వంచనకు గురవుతున్నారు. భారత్‌లో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి ఇంకెక్కడా లేదు. మహారాష్ట్రలో ఇన్ని నదులున్నా నీటి కరవు ఎందుకు? స్వాతంత్య్రం తర్వాత 54 ఏళ్లు కాంగ్రెస్.. 16 ఏళ్లు భాజపా పాలించాయి. ఆ పార్టీలు ఏం సాధించాయి. ఆ రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావని తిట్టుకుంటాయి.’’ అని కేసీఆర్ విమర్శించారు. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయన్న కేసీఆర్.. దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నాందేడ్‌లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లెక్కపెట్టారా? అని అన్నారు. భారాస చేస్తున్నది.. రాజకీయ పోరాటం కాదని.. జీవన్మరణ పోరాటమని అన్నారు.
తెలంగాణలో సాధ్యం..ఇక్కడెందుకు అసాధ్యం?
ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశంలో ఉందన్న కేసీఆర్.. సువిశాల భారత్‌లో కనీసం 2 వేల టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు లేదని ప్రశ్నించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడం లేదు. ట్రైబ్యునళ్ల పేరుతో సంవత్సరాల కొద్దీ జలవివాదాలు పెండింగ్‌లో పెడుతున్నారు. ప్రాజెక్టులకు అనుమతివ్వకుండా తిప్పుతున్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. గట్టిగా అనుకుంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వొచ్చు. 8 ఏళ్ల క్రితం తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవి. సాగునీరు, తాగునీరు, విద్యుత్ కొరత ఉండేది. క్రమంగా అన్ని సమస్యలను అధిగమించాం. తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నాం. రైతు ఏ కారణంతో చనిపోయినా రూ. 5లక్షల బీమా ఇస్తున్నాం. తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు ఇస్తున్నాం. ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కార్ రావాలని పిలుపునిచ్చారు.
అధికారమిస్తే.. 24 గంటల విద్యుత్
దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్ ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. భారాసకు అధికారం ఇస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చిన మార్పు..దేశమంతా రావాల్సిన అవసరముందన్నారు. వచ్చే పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు భారాసను గెలిపించాలని కేసీఆర్ కోరారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలనీ, కిసాన్ సర్కార్ రావాలనీ అన్నారు. భారాస అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP Highc court: కాపు రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
-
Sports News
Virat - ABD: తొలినాళ్లలో విరాట్‌ను అలా అనుకున్నా: ఏబీ డివిలియర్స్
-
Politics News
YS Sharmila: వైతెపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్ షర్మిల
-
India News
Rahul Gandhi: ఆ బంగ్లాలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి: లోక్‌సభ సెక్రటేరియట్‌కు రాహుల్ రిప్లయ్
-
Movies News
Nagababu: రామ్ చరణ్‌కు ఒక సక్సెస్ దూరం చేశాననే బాధ ఇప్పుడు తీరిపోయింది: నాగబాబు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు