BRS: టీఆర్‌ఎస్‌గా మొదలై బీఆర్‌ఎస్‌ దాకా.. ‘గులాబీ’ పార్టీ 21ఏళ్ల ప్రస్థానం ఇలా..!

తెలంగాణ రాజకీయ చరిత్రలో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెరాస.. దాదాపు 21 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంతో జనం ముందుకొచ్చింది........

Published : 06 Oct 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: తెలంగాణ రాజకీయ చరిత్రలో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెరాస.. దాదాపు 21 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంతో జనం ముందుకొచ్చింది. కేసీఆర్‌ సారథ్యంలో ఉద్యమ పార్టీగా మొదలై అలుపెరగని పోరుతో 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారంలో కీలక పాత్ర పోషించి.. దాదాపు 9ఏళ్లుగా తెలంగాణను ఏలుతోన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే దసరా పండుగ వేళ కేసీఆర్‌ భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంలో తెరాస ప్రస్థానం ఎక్కడ మొదలై.. భారాస దాకా చేరిందో ఓసారి అవలోకిస్తే..

అలా మొదలైంది.. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పటికే దశాబ్దాలుగా కొనసాగుతోన్న పోరాటంలో భాగంగా ప్రజా సంఘాలు, మేధావులు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి వినిపిస్తున్న కాలమది. 2000 సంవత్సరం ఆరంభంలో ఏపీ ఉమ్మడి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ తెలంగాణ అంశంపై దృష్టిపెట్టారు. అనేకమంది మేధావులతో విస్తృతమైన చర్చలు జరిపి ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెదేపా నుంచి 2001లో బయటకు వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) అదే ఏడాది ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్రసమితిని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆచార్య జయశంకర్‌ కేసీఆర్‌కు అండదండలందించి తెరాస ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. అప్పట్నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు ఉద్యమ స్ఫూర్తితో తెరాస నిరంతరం ఆందోళనలతో పాలకులపై ఒత్తిడి పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రజా ఉద్యమాల్లో ఒకటైన తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో అగ్రపీఠాన నిలిచింది. 

ఎన్నికల బరిలో తొలిసారి.. కేంద్రమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా!

2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెరాసలు పరస్పర అవగాహనతో ఎన్నికల్లో పోటీచేశాయి. పార్టీ ఏర్పాటైన తర్వాత  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 26 ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ సీట్లు సాధించింది. 2004లో యూపీఏ-1 ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశానికి చోటు కల్పించింది. పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తమ ప్రసంగాల్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. 2004 మే 27న యూపీఏ-1 ప్రకటించిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో చర్చలు, ఏకాభిప్రాయ సాధన ద్వారా తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. యూపీఏలో చేరిన కేసీఆర్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. అయితే, తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని యూపీఏ సర్కార్‌  సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ 2006 సెప్టెంబర్‌లో కేసీఆర్‌ తన కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్‌ లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కరీంనగర్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.

ఒడిదొడుకులు ఎదురైనా పోరాట పంథా వీడలేదు..

తదనంతర కాలంలో తెరాసను చీల్చేందుకు కుట్రలు, ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం వంటి ఎదురు దెబ్బలు.. ఇలా రాజకీయపరమైన ఒడుదొడుకులు ఎదురైనా పోరాట పంథాను మాత్రం వీడకుండా ముందుకు సాగింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ 2008 ఏప్రిల్‌లో తెరాస ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు జరగ్గా.. తెరాస కేవలం ఏడు అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, వామపక్షాలతో కలిసి బరిలోకి దిగింది. ఈ ఎన్నికలకు ముందు జరిగిన మహానాడులో తెదేపా తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేసింది. అయితే, ఆ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌, పీఆర్‌పీ, భాజపా మధ్య ఓట్లు చీలికతో మహాకూటమి విజయావకాశాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో తెరాస కేవలం 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్సే అధికారం దక్కించుకుంది.

కేసీఆర్‌ దీక్షతో ఉద్యమం మహోగ్రరూపం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి యూపీఏ-2 ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావించిన కేసీఆర్‌ 2009 నవంబర్‌ 29న ఆమరణదీక్ష చేపట్టారు. అయితే, పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం సబ్‌ జైలుకు తరలించారు. దీంతో ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. విద్యార్థులు, ఉద్యోగులూ, న్యాయవాదులు, వైద్యులు.. ఇలా సకల జనుల్లో ఉద్యమం దావానలంలా వ్యాపించింది. ఈ ఉద్యమంతో యావత్‌ తెలంగాణ స్తంభించిపోయింది. ఈ క్రమంలో డిసెంబర్‌ 7న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికే కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్రం ప్రభుత్వం డిసెంబర్‌ 9, 2009న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ సంప్రదింపులు, అధ్యయనం తర్వాత ఆ కమిటీ నివేదిక ఇచ్చినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని అన్ని రాజకీయ శక్తుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేలా తెలంగాణ జేఏసీని కేసీఆర్‌ ఏర్పాటు చేశారు. అనేక సంస్థలు, పార్టీలు ఇందులో భాగస్వాముల్ని చేశారు. ఈ రాజకీయ జేఏసీకి ఆచార్య కోదండరామ్‌ను ఛైర్మన్‌గా ఉన్నారు. టీజేఏసీ చేపట్టిన నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో తెరాస శ్రేణులు క్రియాశీలంగా పాల్గొన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు సాగించిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం, ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు పెరిగిపోవడంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు 2013 జులైలో కాంగ్రెస్‌ నిర్ణయం తీసకుంది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదించింది.

(ఉద్యమ సమయంలో సాగర హారానికి హాజరైన జనసందోహం)

హ్యాట్రిక్‌ విజయం.. దేశ రాజకీయాలపై ప్రభావమే లక్ష్యంగా..

ఆ తర్వాత 2014 ఏప్రిల్‌-మే మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 63 అసెంబ్లీ, 11 లోక్‌సభ స్థానాలు గెలుచుకొని తొలిసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లలో అపూర్వ విజయంతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ హ్యాట్రిక్‌ సాధించడమే లక్ష్యంగా తనదైన మార్కుతో ముందుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. భాజపాపైనా, మోదీ సర్కార్‌పైనా తనదైన శైలిలో విరుచుకుపడుతున్న కేసీఆర్‌ ఇప్పటికే అనేకసార్లు జాతీయ పార్టీ పెడతామంటూ సంకేతాలు ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలపై దృష్టిసారించిన కేసీఆర్‌ అనేక సంప్రదింపుల అనంతరం దసరా రోజున తెరాసను భారాసగా మారుస్తూ తీర్మానం చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని