KCR: ‘ప్రైవేటు’కు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితి, బ్లాక్‌ ఫంగస్‌పై మంత్రులు, ఉన్నతాధికారులతో ....

Published : 18 May 2021 01:48 IST

ఆక్సిజన్‌ కొరత రానివ్వొద్దని అధికారులకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితి, బ్లాక్‌ ఫంగస్‌పై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో కొవిడ్‌తో నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వఆస్పత్రుల్లో 6,926 పడకలు ఖాళీగా ఉన్నట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉండటంతో పాటు రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాలు కూడా ఉన్నాయని, పూర్తి స్థాయి చికిత్సకు అవసరమైన వసతులు అందుబాటులో ఉన్నందున ప్రజలంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. 

48 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు..
కొవిడ్ రోగులకు 324 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఆక్సిజన్‌ కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో అదనంగా మరో 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని సూచించారు. పది రోజుల్లోగా ట్యాంకర్లు అందించాలని ఉత్పత్తిదారులను సీఎం కోరారు. ఆక్సిజన్‌ సరఫరా విషయంలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడొద్దని సూచించారు.

బ్లాక్‌ ఫంగస్‌పైనా సుదీర్ఘ చర్చ
కరోనా తర్వాత వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ పైనా సీఎం చర్చించారు. దీనికి అవసరమైన చికిత్స ఏర్పాట్లపైనా అధికారులను ఆరా తీశారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన పరికరాలు, ఔషధాలను పూర్తిస్థాయిలో సమకూర్చుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు కోఠిలోని ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రిలో సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాల్లోని వైద్య కళాశాలల ఆస్పత్రుల్లోనూ సామగ్రి, మందులు సమకూర్చాలన్నారు. 

భయాందోళనకు గురికావొద్దు

రాష్ట్రంలో ప్రస్తుతం 1.86లక్షల టీకా డోసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే, ఇప్పటికే వ్యాక్సిన్లకు గ్లోబల్‌ టెండర్లకు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన టీకాలను సమకూర్చుకొనేందుకు ఎప్పటికప్పుడు కేంద్ర అధికారులతో సంప్రదించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆక్సిజన్‌ సరఫరాలో ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కరోనా విషయలో ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వైద్యకళాశాలల ఏర్పాటుకు ఆదేశం
సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లలో కొత్తగా వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలని..అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలూ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వైద్యకళాశాలల్లో నర్సింగ్‌ కళాశాలలు లేనిచోట్ల మంజూరు చేయాలన్నారు. అనుమతులొచ్చిన నర్సింగ్‌ కాలేజీల మంజూరుకు ప్రతిపాదనలు పరిశీలించాలని సీఎం సూచించారు. కొత్తగా రీజనల్‌ సబ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ పడకల విషయమై గతంలోనే ఉత్తర్వులు ఇచ్చామన్నారు. 

డిశ్చార్జిలు పెరగడం సంతోషకరం..
అనంతగిరిలో 200 పడకల ఆస్పత్రిని కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించాలని, అలాగే, సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, రైల్వే, ఈఎస్‌ఐ ఆస్పత్రులను కొవిడ్ చికిత్సకు వాడాలని సూచించారు. అందుబాటులోని అన్ని ఆస్పత్రులను కొవిడ్‌ కోసం వినియోగంలోకి తేవాలన్నారు. లాక్‌డౌన్‌, సర్వే, కిట్ల పంపిణీతో అడ్మిషన్లు తగ్గి.. డిశ్చార్జులు పెరగడం సంతోషకరమన్నారు. కోలుకుంటున్న వారి శాతం మెరుగ్గా ఉండటం మంచి పరిణామమన్నారు. సర్వేలో గుర్తించిన వారిని బృందాలు సంప్రదిస్తూ ఉండాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ మౌలిక వసతులకు ఎంతైనా ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రీజనల్‌ సబ్‌ సెంటర్లు ప్రభుత్వాసుపత్రులకు మందులు అందించేందుకు వాహనాలు.. మందులు నిల్వ చేసేందుకు సబ్‌ సెంటర్లలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నిరంజన్‌ రెడ్డి
వనపర్తికి వైద్య కళాశాల ఇచ్చినందుకు సీఎంకు మంత్రి నిరంజన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య కళాశాలపై 2018 ఎన్నికల సభలో హామీఇచ్చారన్నారు. సీఎం మాటిస్తే అమలై తీరుతుందని మరోసారి నిరూపితమైందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని