BRS: రైతుల తుపాన్‌ రాబోతోంది.. ఎవరూ ఆపలేరు: కేసీఆర్‌

తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలోనూ అమలు చేస్తే మరోసారి ఇక్కడికి రానని భారాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ పేరిట నాందేడ్‌ జిల్లాలోని లోహాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Updated : 26 Mar 2023 16:34 IST

నాందేడ్‌: దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని, దాన్నెవరూ ఆపలేరని భారాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరెంట్‌ అందిస్తున్నామని, రైతు బీమా ఇస్తూ.. పూర్తిగా పంటను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడణవీస్‌ చేస్తే మళ్లీ మహారాష్ట్ర రానని ప్రకటించారు. అలాంటి పథకాలు అమలు చేయనంత వరకు వస్తూనే ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌రావు దోండే సహా పలువు మరాఠా నేతలను గులాబీ కండువా కప్పి కేసీఆర్‌ భారాసలోకి ఆహ్వానించారు.

‘‘మహారాష్ట్రలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో దళితబంధు అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలోనూ దళితబంధు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా. మహారాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కరించండి. మరోసారి ఇక్కడికి రాను. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా పేదల బతుకులు మారలేదు. కాంగ్రెస్‌, భాజపాలతో మన బతుకులు మారాయా? కాంగ్రెస్‌ 54 ఏళ్లు, భాజపా 14 ఏళ్లపాటు పాలించి ఏం చేశాయి? దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయి. అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. ఏటా 40 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నదులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరగడం లేదు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. దేశంలో 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉంది. దీంతో 24 గంటల విద్యుత్‌ సులభంగా ఇవ్వొచ్చు.’’ అని కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రలో భారాస బహిరంగ సభ నిర్వహించడం ఇది రెండోసారి. గతంలో నాందేడ్‌లో నిర్వహించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో నేతల మాటలకు మోసపోయామని కేసీఆర్‌ అన్నారు. రైతులు మోసపోకూడదనే అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ధర్మం మతంపేరుతో విడిపోతే.. రైతు ఆత్మహత్యలు ఆగబోవని చెప్పారు. గతంలో నాందేడ్‌లో సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేశారని, దీంతో భారాస సత్తా ఏంటో ప్రజలకు అర్థమైందని కేసీఆర్‌ అన్నారు. ‘‘ కేసీఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ అంటున్నారు. తెలంగాణలో మేం ఇస్తున్నట్లు మహారాష్ట్ర రైతులకు కూడా ఇవ్వాలి. పీఎం కిసాన్‌ కింద రైతులకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలి.’’ అని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

భారాస పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్‌ చేయించినట్లు కేసీఆర్‌ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాస పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ‘‘ ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి. స్థానిక సంస్థల్లో భారాసాను గెలిపించండి.. మీ సమస్యలు పరిష్కరించి చూపిస్తా’’ అని కేసీఆర్‌ అన్నారు. ఫసల్‌ బీమా యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా?అని సభకు హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించారు. భారాసను గెలిపిస్తే.. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని