
Arvind Kejriwal: త్వరలో ఆప్ మంత్రిని అరెస్టు చేస్తారు.. కానీ, మేం చన్నీలా ఏడ్వం
అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
దిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో త్వరలో దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ‘జైన్‌ను ఈడీ అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. ఆయన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం గతంలోనూ రెండుసార్లు దాడులు చేయించినా.. ఏం దొరకలేదు. ఈడీ అధికారులు మళ్లీ రావాలనుకుంటే.. వారికి స్వాగతం’ అని అన్నారు. ఈ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నప్పుడల్లా భాజాపా.. ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగిస్తుందని విమర్శించారు.
‘ఇప్పుడు కూడా దాడులు, అరెస్టులు ఉంటాయి. కానీ, మేం భయపడటం లేదు. ఈడీతోపాటు సీబీఐ, ఐటీ, దిల్లీ పోలీస్ తదితర విభాగాల అధికారులను పంపినా.. స్వాగతిస్తాం’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇటీవల పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడిపై ఈడీ దాడులను ప్రస్తావిస్తూ.. ‘ఈ విషయంలో మేం చన్నీలాగా చేయం. ఆయన తప్పు చేసి దొరికిపోయారు కాబట్టే భయపడుతున్నారు. ఆ దాడుల్లో పట్టుబడిన నగదు చూసి.. పంజాబ్ ప్రజలే షాక్ అయ్యారు. కానీ, మాకు ఆ భయం లేదు. సత్యేందర్ జైన్ ఎందుకు? అధికారులను మా ఇంటికి, భగవంత్ మాన్ (ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి) ఇంటికి పంపండి’ అని సవాల్ విసిరారు! అయితే, జైన్‌ను ఏ కేసు విషయంలో ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందో కేజ్రీవాల్ వెల్లడించలేదు.