Mamata-Kejriwal: దీదీతో కేజ్రీవాల్‌ భేటీ.. వాటిపైనే చర్చించారా?

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దిల్లీలోని దీదీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి చెందిన నివాసంలో ఇద్దరూ సమావేశమయ్యారు.

Updated : 30 Apr 2022 01:59 IST

దిల్లీ: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దిల్లీలోని దీదీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి చెందిన నివాసంలో ఇద్దరూ సమావేశమయ్యారు. శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో పాల్గొనడానికోసం మమతా దిల్లీ చేరుకున్నారు. దాదాపు అర్ధగంట పాటు కొనసాగిన వీరి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత, రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు సహా పలు అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీయేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. పంజాబ్‌లో అపూర్వ విజయం సాధించిన కేజ్రీవాల్‌ను మమత అభినందించారన్నారు.

మరోవైపు, ఇటీవల గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసిన తర్వాత ఇరు పార్టీల అగ్రనేతలు భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోవాలో ఆప్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పొత్తులపై రెండు రౌండ్లలో చర్చలు జరిగినా.. అవగాహన కుదరలేదు. దీంతో ఎవరికి వారే పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య క్షీణించిన రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకొనే అంశంపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ఇద్దరి నేతల మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే అంశాన్ని అటు ఆప్‌ గానీ, ఇటు తృణమూల్‌ కాంగ్రెస్‌ గానీ అధికారికంగా పేర్కొనలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని