గెలిపిస్తే.. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ వర్శిటీ: కేజ్రీవాల్‌ హామీ!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. కొత్త కొత్త హామీలతో ఓటర్లను ఆకట్టుకొనే పనిని షురూ చేశాయి.......

Published : 16 Dec 2021 01:19 IST

జలంధర్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. కొత్త కొత్త హామీలతో ఓటర్లను ఆకట్టుకొనే పనిని షురూ చేశాయి. ఈసారి పంజాబ్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకెళ్తున్న ఆప్‌.. అన్ని వర్గాల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్‌ హామీని ప్రకటించిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం జలంధర్‌లో నిర్వహించిన సభలో మరికొన్ని హామీలు గుప్పించారు. పంజాబ్‌లో తమ పార్టీని గెలిపిస్తే జలంధర్‌లో అంతర్జాతీయ విమానాశ్రాయాన్ని నిర్మించడంతో పాటు దేశంలోనే అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్‌ వచ్చిన ఆయన.. జలంధర్‌లో నిర్వహించిన పార్టీ తిరంగ యాత్రలో పాల్గొన్నారు.

జలంధర్‌ క్రీడా పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిందని, అనేకమంది పాపులర్‌ క్రికెటర్లు, హాకీ క్రీడాకారులు ఇక్కడ తయారైన వస్తువులనే వాడతారన్నారు. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటైతే జలంధర్‌లో దేశంలోనే అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అనేది బియాస్‌, సట్లేజ్‌ నదుల మధ్య ఉన్న దోబా ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఉద్యమించి విజయం సాధించిన రైతులను అభినందించారు. అన్నదాతల పోరాటం గెలిచినట్లే మనమంతా పంజాబ్‌ అభివృద్ధి కోసం, ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎన్నికల యుద్ధంలో గెలుపొందాలన్నారు. పాఠశాలలు, విద్య కోసమే తమ పార్టీ పనిచేస్తోందన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలనేది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కల అన్నారు. కానీ, 70 ఏళ్ల తర్వాత కూడా ఇది సాకారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బాబా సాహెబ్‌ కలల్ని తాము సాకారం చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని