11 రాష్ట్రాల సీఎంలకు విజయన్‌ లేఖ 

కరోనా కట్టడిలో బ్రహ్మాస్త్రంగా పనిచేసే వ్యాక్సిన్ల విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.  రాష్ట్రాలకు అవసరమైన టీకాలను సేకరించి ఉచితంగా పంపిణీ చేయాలంటూ.....

Published : 01 Jun 2021 01:39 IST

తిరువనంతపురం: కరోనా వ్యాక్సిన్ల విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. రాష్ట్రాలకు అవసరమైన టీకాలను కేంద్రమే సేకరించి ఉచితంగా పంపిణీ చేయాలంటూ కలిసికట్టుగా ఒత్తిడి తేవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు భాజపాయేతర పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సోమవారం ఆయన లేఖలు పంపారు. విజయన్‌ లేఖ రాసిన సీఎంల జాబితాలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ భూపేశ్‌ బఘేల్‌, ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారు.

సహకార సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తితో 11 మంది సీఎంలకు లేఖ రాసినట్టు విజయన్‌ పేర్కొన్నారు. టీకాలు సేకరించడం, సార్వత్రిక ఉచిత వ్యాక్సినేషన్‌ బాధ్యతల నుంచి తప్పుకొనేలా కేంద్రం వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సమయంలో అంతా కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగైతేనే కేంద్రం సత్వర చర్యలు చేపడుతుందని విజయన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు సీఎంలకు రాసిన లేఖను జతచేశారు. 

వ్యాక్సిన్‌ సేకరణ బాధ్యత రాష్ట్రాలదేనంటూ ప్రకటనలు చేయడం సహకార సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయడమేనని విజయన్‌ పేర్కొన్నారు. టీకాలు సేకరించే బాధ్యత రాష్ట్రాలపై పెడితే వాటిపై ఆర్థిక భారం పడుతుందన్నారు. దేశ జనాభాలో గణనీయ సంఖ్యలో టీకా వేసినప్పుడే హెర్డ్‌ ఇమ్యూనిటీ ప్రభావవంతంగా ఉంటుందని విజయన్‌ పేర్కొన్నారు. కానీ, ఇప్పటివరకు కేవలం 3.1 శాతం మంది ప్రజలు మాత్రమే రెండు డోసులు వేశారని తెలిపారు. విదేశీ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకొనేందుకు విముఖత ప్రదర్శిస్తున్నాయని, దేశంలోని ప్రభుత్వ రంగ పార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేసే సామర్థ్యంతో ఉన్నందున అలాంటి కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు కల్పించాలని కోరారు. మూడో ముప్పు మరింత ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని విజయన్‌ గుర్తుచేశారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా టీకాల సేకరణ, గ్లోబల్‌ టెండరింగ్‌ తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను కూడా ఆయన సీఎంలకు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని