Vijayan: సిసోదియా అరెస్టుపై ప్రధానికి సీఎం విజయన్‌ లేఖ

మనీశ్ సిసోదియా అరెస్టు వ్యవహారంలో రాజకీయ కారణాలు ఉన్నాయంటూ వస్తోన్న అభిప్రాయాలను తొలగించాలని కోరుతూ కేరళ సీఎం విజయన్‌ ప్రధానికి లేఖ రాశారు.

Published : 08 Mar 2023 00:25 IST

తిరువనంతపురం: ఆప్‌ సీనియర్‌ నేత, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish sisodia) అరెస్టు వ్యవహారంపై కేరళ సీఎం పినరయి విజయన్‌(Pinarayi Vijayan) ప్రధాని మోదీ(PM Modi)కి లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే సిసోదియాను టార్గెట్‌ చేసి అరెస్టు చేశారన్న అభిప్రాయాలను తొలగించాలని ప్రధానిని కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరే ఇలాంటి వాదనలకు మరింత బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. సిసోదియా కేసులో నగదు స్వాధీనం చేసుకోవడం వంటి నేరపూరిత ఆధారాలు కూడా లేవని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఉన్న సిసోదియా దర్యాప్తు సంస్థలు జారీ చేసిన సమన్లను గౌరవించి విచారణకు హాజరయ్యారన్నారు. దర్యాప్తునకు ఆటంకం లేకుండా  తప్పనిసరైతే అరెస్టు చేయాల్సింది తప్ప లేకపోతే  అలాంటి చర్యలను నివారించాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు. 

చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందేనన్న విజయన్‌.. కానీ, రాజకీయ కారణాలతోనే సిసోదియాను టార్గెట్‌ చేశారన్న విస్తృతమైన భావనను తొలగించడం కూడా అంతే ముఖ్యమని లేఖలో పేర్కొన్నారు. మితిమీరిన చర్యలను నివారించడం ద్వారా సహకార సమాఖ్య సూత్రాన్ని పాటించాలని కోరారు. దర్యాప్తులో ఉన్న ఈ కేసులో మెరిట్స్‌ గురించి చెప్పకుండా దర్యాప్తు సంస్థలు సిసోదియా అరెస్టు చేయడం ద్వారా అలాంటి వాదనలకు మరింత బలాన్నిచ్చినట్టవుతోందని తెలిపారు. న్యాయం జరగడం మాత్రమే కాదు.. అలా జరిగినట్టు కనిపించాలన్నదే సహజ న్యాయ సూత్రమన్నారు. 

మనీశ్ సిసోదియాను అరెస్టును ఖండిస్తూ ఇటీవల తొమ్మిది మంది విపక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టును ఖండిస్తూ 9 మంది విపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని లేఖలో ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలకు దిగడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో  దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్  సీఎం భగవంత్  మాన్, బెంగాల్  సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, నేషనల్‌కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్దవ్‌ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని