Kerala: మీకు దమ్ముంటే నాపై దాడి చేయండి: కేరళ గవర్నర్‌

కేరళ సర్కారు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్ ఖాన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల సమస్యను సృష్టిస్తూ.. తనను సైతం బెదిరిస్తున్నారని విమర్శించారు. 

Published : 08 Nov 2022 01:24 IST

తిరువనంతపురం: కేరళలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, సీఎం పినరయి విజయన్‌ సర్కారు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. సోమవారం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. సీపీఎం నాయకులకు తనపై దాడి చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నవంబరు 15న రాజ్యభవన్‌ను ముట్టడిస్తామని అధికారపక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సీపీఎం నాయకులకు దమ్ముంటే నాపై దాడి చేయమనండి. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను ఈ సర్కారు నాశనం చేస్తోంది. నేను వారిని కోరేది ఒక్కటే. మీకు దమ్ముంటే రాజ్‌భవన్‌లోకి చొరబడి, నాపై దాడి చేయండి. సీఎం నేనెవరో తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. కానీ, ఆయనెవరో నాకు తెలుసు’’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని కేరళ సర్కారు ఆరోపిస్తోంది.  గవర్నర్‌ పనితీరుపై చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా పోరాటం చేస్తామని కేరళ సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌వీ గోవిందన్‌ ఆదివారం ప్రకటించారు. గవర్నర్‌ తీరుకు నిరసనగా నవంబరు 15న రాజ్‌భవన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రకటన నేపథ్యంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ సీపీఎం నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘నవంబరు 15న కాదు, నేను రాజ్‌భవన్‌లో ఉన్నప్పుడే మార్చ్‌ నిర్వహించండి. మీతో బహిరంగ చర్చకు నేను సిద్ధం. వీసీలకు వారి బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. శాంతి, భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. ఆఖరికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సివుంటుందని నన్ను కూడా బెదిరిస్తున్నారు’’ అని గవర్నర్‌ అన్నారు. 

కొద్దిరోజుల క్రితం 11 యూనివర్సిటీల ఉపకులపతులు రాజీనామా చేయాలంటూ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదేశాలిచ్చారు. దీనిపై రాష్ట్ర సర్కారు ఘాటుగా స్పందించింది. గవర్నర్‌కు అలా ఆదేశాలిచ్చే అధికారాల్లేవని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. తర్వాత  ఆర్థిక మంత్రి కె.ఎన్‌.బాలగోపాల్‌ను పదవి నుంచి తొలగించాలంటూ గవర్నర్‌ లేఖ రాయడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ రాజ్‌భవన్‌ వేదికగా సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నారని అధికార పక్షం సీపీఎంతోపాటు విపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా గవర్నర్‌ చర్యను తప్పుబట్టాయి. 

అలాంటి ఛానళ్లతో నేను మాట్లాడను

ఈ సందర్భంగా గవర్నర్ పలు మీడియా సంస్థలపైనా అసహనం వ్యక్తం చేశారు. కొన్ని ఛానళ్లు మీడియా ముసుగులో రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ‘‘మీడియా ఈ ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమైందని నేను భావిస్తాను. మీరు నన్ను ఎప్పుడు సంప్రదించినా స్పందిస్తున్నా. కానీ, మీడియా ముసుగులో రాజకీయం చేస్తున్న ఛానళ్లతో నేను మాట్లాడలేను. వారు రాజకీయ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఛానళ్లతో ఇకపై నేను మాట్లాడను’’ అని వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని