Election Results 2022: ప్రముఖుల్లో విజేతలు.. పరాజితులు..

ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌, అఖిలేశ్ యాదవ్‌ సహా కొందరు ప్రముఖులు తమ కంచుకోటల్లో జయభేరి మోగించారు. అయితే కొందరికి

Published : 10 Mar 2022 17:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. యూపీలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడగా.. పంజాబ్‌ను ఆమ్‌ ఆద్మీ ఊడ్చేసింది. గోవా, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోనూ భాజపా గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో కొందరు ప్రముఖులు సునాయాసంగానే విజయం సాధించినప్పటికీ.. మరికొందరు దిగ్గజాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా పంజాబ్‌లో సీఎం సహా కాంగ్రెస్‌లో ప్రముఖ నేతలందరూ ఓటమిపాలవ్వడం గమనార్హం. మరి 5 రాష్ట్రాల్లో ప్రముఖుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఉత్తరప్రదేశ్: 

* యోగి ఆదిత్యనాథ్: యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేశారు. గతంలో గోరఖ్‌పూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అనేకసార్లు పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. తనకు మంచి పట్టున్న అదే గోరఖ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. ఆయనపై భీమ్‌ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌(రావణ్‌) పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో యోగి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఆజాద్ కనీసం పోటీలో కూడా నిలువలేకపోయారు.

* అఖిలేశ్‌ యాదవ్‌: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు శాసనమండలి నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆజంగఢ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న అఖిలేశ్.. తాజా ఎన్నికల్లో ములాయం కుటుంబానికి గట్టి బలమున్న కర్హాల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అఖిలేశ్‌కు పోటీగా భాజపా కేంద్రమంత్రి ఎస్పీ సింగ్‌ భగేల్‌ను బరిలోకి దించింది. కానీ హోరాహోరీగా జరిగిన ఈ పోరులో అఖిలేశ్ 47వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

* కేశవ్ ప్రసాద్‌ మౌర్య: యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సిరాతు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనకు పోటీగా ఎస్పీ నుంచి కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ సోదరి పల్లవి పటేల్‌ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మౌర్య ఓటమిపాలయ్యారు.  

* శివపాల్ సింగ్‌ యాదవ్‌: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సోదరుడు శివపాల్‌ సింగ్‌యాదవ్ మరోసారి జశ్వంత్‌ నగర్‌లో సత్తా చాటారు. 1996 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న శివపాల్‌.. ఈ సారి కూడా విజయం సాధించారు. 

* పంకజ్‌ సింగ్‌: కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కుమారుడు పంకజ్‌ సింగ్‌ మరోసారి నోయిడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. 

* ఓం ప్రకాశ్‌ రాజ్‌బర్‌: సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌బర్‌ జహూరాబాద్‌ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్న ఈ పార్టీ.. తాజా ఎన్నికల్లో అఖిలేశ్‌తో చేతులు కలిపింది. 

* అబ్దుల్లా ఆజంఖాన్‌: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆజంఖాన్‌ కుమారుడు అబ్దుల్లా ఆజంఖాన్.. సుఅర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ అబ్దుల్లా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. అయితే ఆయన ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు అప్పట్లో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 

పంజాబ్‌:

* చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ: పంజాబ్‌ సీఎం చన్నీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. తనకు మంచి పట్టున్న చామకౌర్‌ సాహిబ్‌తో పాటు భదౌర్ నుంచి బరిలోకి దిగారు. అయితే ఫలితాల్లో రెండు చోట్లా ఆయన ఓటమి చవిచూశారు. 

* నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ: పంజాబ్ కాంగ్రెస్‌ చీఫ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నుంచి ఓడిపోయారు. ఆయనకు పోటీగా మాజీ మంత్రి బిక్రమ్ సింగ్‌ మజీతియా బరిలోకి దిగారు. అయితే ఇక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. 

* కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు తన కంచుకోట పాటియాలాలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఆయన ఆప్‌ చేతిలో ఓడిపోయారు.

* ప్రకాశ్ సింగ్‌ బాదల్‌: శిరోమణి అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌  లంబీ నుంచి ఓడిపోయారు. 1997 నుంచి బాదల్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన వయసు 94 ఏళ్లు. ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడు ఈయనే కావడం విశేషం. 

* భగవంత్‌ మాన్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మాన్‌ ధురి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన సంగ్రూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

* సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్: శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ జలాలాబాద్‌ నియోజకవర్గం ఓడిపోయారు. 2009, 2012, 2017 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన ఆయన.. 2019లో అసెంబ్లీకి రాజీనామా చేసి ఫిరోజ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగగా.. అదృష్టం వరించలేదు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా:

* ఉత్తరాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ ఓడిపోయారు. లాల్‌కౌన్‌ నుంచి పోటీ చేసిన ఆయన 14వేల పైచిలుకు తేడాతో పరాజయం పొందారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి కూడా ఖతిమా నియోజకవర్గంలో ఓడిపోయారు.

* గోవాలో సీఎం ప్రమోద్‌ సావంత్ విజయం సాధించారు. అయితే దివంగత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 

* మణిపూర్‌లో సీఎం బీరేన్‌ సింగ్‌ విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని