BJP: కర్ణాటకలో కమలం వాడిపోవడానికి కారణాలెన్నో..!

కర్ణాటకలో భాజపా పరాజయం పాలైంది. ఈ సారి ఓటర్లు కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు. భాజపా ఓటమికి కారణాలేంటంటే..

Updated : 13 May 2023 17:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో అధికార భాజపా చతికిలపడింది. గతంలో సాధించిన సీట్లలో దాదాపు 40కిపైగా ఈ సారి కోల్పోయింది. కేవలం కొన్ని సామాజిక వర్గాలపై ఆధారపడటం.. అవినీతి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం.. రిజర్వేషన్ల తేనెతుట్టెను ఎన్నికలకు ముందు కదపడం వంటివి కమలం విజయావకాశాలను దెబ్బతీశాయి. ఎన్నికల ప్రచారం చివర్లో భాజపా దిగ్గజ నేతలు మోదీ, షా, యోగి త్రయం ప్రచారం చేసినా..  అవి ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నికలకు చాలా ముందుగానే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నా.. గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో నాయకత్వం చొరవ చూపకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.

లింగాయత్‌ ఓట్లలో చీలిక..

కర్ణాటకలోని 224 సీట్లలో లింగాయత్‌ సామాజిక వర్గానికి దాదాపు 70 సీట్లలో బలమైన పట్టుంది. మరో 30 సీట్లలో గెలుపు ఓటములను శాసించగలిగే స్థాయిలో వీరికి ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తంగా దాదాపు 100 సీట్లలో వీరి ప్రభావం ఉంది. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని బెలగావి, ధార్వాడ్‌, గడగ్‌ జిల్లాలతోపాటు బగల్‌కోట్‌, బీజాపుర్‌, కలబురిగి, బీదర్‌, రాయచూర్‌లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వీరికి ఓట్లు ఉన్నాయి. ఇక దక్షిణ కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్‌, మాండ్యల్లో లింగాయత్‌ల ప్రభావం కనిపిస్తుంది.

1990 వరకు ఈ సామాజిక వర్గం కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారుగా ఉంది. కానీ, 1990 అక్టోబర్‌లో లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన నాటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను నాటి కాంగ్రెస్‌ అధినేత రాజీవ్‌ గాంధీ ఇబ్బందికర పరిస్థితుల్లో తప్పించారు. ఈ ఘటన తర్వాత ఆ సామాజిక వర్గం హస్తం పార్టీకి దూరమైంది. 2008 నాటికి వీరి ఓట్లు యడియూరప్ప నేతృత్వంలో భాజపా పక్షానికి చేరాయి. 2018లో సిద్ధరామయ్య ప్రభుత్వం వీరికి మైనార్టీ హోదా ఇవ్వాలని నిర్ణయించడం ఆ సామాజిక వర్గానికి మింగుడుపడలేదు.

2018 ఎన్నికల్లో లింగాయత్‌లకు పట్టున్న 70 స్థానాల్లో 38 భాజపా గెలుచుకొంది. భాజపాకు అండగా ఉన్న ఈ ఓటు బ్యాంక్‌ ఈ సారి చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. లింగాయత్‌ల్లో యడియూరప్పకు అతిపెద్ద నాయకుడిగా పేరుంది. 2021 జులైలో భాజపా ఆయన్ను బలవంతంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం ఆ సామాజిక వర్గానికి నచ్చలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మరో లింగాయత్‌ నేత బసవరాజ్‌ బొమ్మై వచ్చారు. కానీ, ఆ సామాజికవర్గంలో ఆయనకు అంత పట్టులేదు. దీనికి తోడు ఈ సారి ఎన్నికల్లో  అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌, లక్ష్మణ్‌ సావడి వంటి నేతలకు మొండి చెయ్యి చూపింది. దీంతో వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. 2023లో యడ్డీ బరిలో లేకపోవడం.. ఇద్దరు కీలక నేతలు పార్టీ మారడంతో  ఈ సామాజిక వర్గం ఓట్లు కొంత కాంగ్రెస్‌ వైపు మళ్లాయి.   

గంపగుత్తగా దూరమైన ముస్లింలు..

ఈ ఏడాది జనవరిలో పఠాన్ సినిమా విడుదల సమయంలో బాయ్‌కాట్‌ వివాదంపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందిస్తూ.. అనవసరమైన వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని భాజపా నాయకులకు హితవు పలికారు.  అన్నివర్గాలతో కలుపుగోలుగా ఉండాలని సూచించారు. కానీ, కర్ణాటక ఎన్నికలకు వచ్చేసరికి బొమ్మై నేతృత్వంలోని భాజపా సర్కారు ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించింది. దీనికి తోడు ముస్లిం ఓట్లు తమకు అవసరం లేదని యడియూరప్ప, మాజీ మంత్రి ఈశ్వరప్పలు ప్రచారం సందర్భంగా తెగేసి చెప్పడం కూడా చేటు చేసింది. ఈ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు 13శాతం ఉన్నారు. హిజాబ్‌, హలాల్‌ కట్‌, అజాన్‌, గోవధ నిషేధ చట్టం, ముస్లిం 2బీ రిజర్వేషన్ల రద్దు, టిప్పు సుల్తాన్‌ వంటి అంశాలు తరచూ రగులుతూ కమలం పార్టీని మైనార్టీలకు పూర్తిగా దూరం చేశాయి. 

రిజర్వేషన్ల దెబ్బ..

ఎన్నికలకు ముందు బొమ్మై సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదపడం బెడిసికొట్టి భాజపాను దెబ్బతీసింది. ముస్లింలకు ఉన్న 4 శాతం మైనార్టీ రిజర్వేషన్లను తొలగించి.. వారిని ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కేటాయించిన 10శాతం కేటగిరిలో చేర్చారు. ముస్లింలకు తొలగించిన 4 శాతాన్ని లింగాయత్‌, వక్కలిగలకు సమానంగా కేటాయించారు. ఇప్పటికే ఈబీసీ కోటా కింద రిజర్వేషన్లను అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, వైశ్య, జైనులు వంటి వారు అనుభవిస్తున్నారు. వీరంతా భాజపాకు బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్నారు.  కానీ, ఇప్పుడు వారి రిజర్వేషన్లలోకి మరో వర్గాన్ని చేర్చడాన్ని వారు జీర్ణించుకొనే అవకాశంలేదు. మరోవైపు రిజర్వేషన్లలో మార్పుల కారణంగా నష్టపోతామని ఎస్సీల్లో పెద్ద వర్గమైన బంజారాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం కూడా చేటు చేసింది.

ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు..

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వంపై ఎన్నికల ముందు వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఆ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేశాయి. కర్ణాటక కాంట్రాక్ట్‌ అసోసియేషన్‌ నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ లేఖను విడుదల చేసింది. పబ్లిక్‌ ప్రాజక్టుల్లో 40శాతం కమిషన్‌ తీసుకొంటోందని ఆరోపించింది. 2021లో ఈ సంఘం కర్ణాటకలో అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాసింది. కానీ ఎటువంటి చర్యలు లేవు. తాజాగా అటువంటి ఆరోపణలే ఎన్నికలకు ఒక్క రోజు ముందు చేయడం ఓటర్లపై కొంత ప్రభావం చూపింది. దీనికితోడు కాంగ్రెస్‌ పార్టీ  కూడా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చేపట్టిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. ఎన్నికలకు ముందు భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్టు కూడా పార్టీని బాగా దెబ్బతీసింది.

ధరల పెరుగుదల.. నిరుద్యోగం.. ప్రభుత్వ వ్యతిరేకత..

కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా కాషాయం పార్టీ ఓటమికి కారణమైంది. గత 20 ఏళ్లలో వరుసగా ఏ పార్టీ రెండోసారి అధికారం చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ర్యాలీలను ఆ పార్టీ నమ్ముకొంది. దీనికి తోడు నిత్యావసరాల ధరల పెరుగుదల అంశాన్ని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, జేడీఎస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా వంటగ్యాస్‌, చమురు అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. దీనిని ఎదుర్కోవడానికి భాజపా ఏటా ఉగాది, గణేశ్‌ చతుర్థి, దీపావళి సమయంలో పేదలకు మూడు ఎల్‌పీజీ సిలిండర్లు, రేషన్‌ ఉచితంగా ఇస్తామన్న హామీ ఆకట్టుకోలేదు. పలు సంస్థలు చేపట్టిన సర్వేల్లో నిరుద్యోగం కూడా ప్రధాన ఎన్నికల అంశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో భాజపా ప్రతిగ్రామంలో ఓ యువ స్వయం సహాయ బృందానికి రూ.10 లక్షలు మూలధనంగా సమకూరుస్తామని చెప్పింది. మరోవైపు కాంగ్రెస్‌ గ్రాడ్యూయేట్లకు రూ.3,000, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1,500 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడం యువ ఓటర్లను ఆకట్టుకొంది. 

ఎమ్మెల్యేల వేటను వ్యతిరేకించిన ప్రజలు..

2018 ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టలేదు. కాకపోతే భాజపాను అతిపెద్ద పార్టీగా ఎన్నుకొన్నారు. ఈ క్రమంలో యడ్డీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది రోజుల్లోనే కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ + జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ, 2019 జులైలో 17 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఈ సంక్షోభానికి భాజపానే కారణమనే విమర్శలు తలెత్తాయి. ఆ తర్వాత యడియూరప్ప నేతృత్వంలోని భాజపా మరోసారి అధికారం చేపట్టింది. కర్ణాటక ఓటర్లు ఈ పరిణామాలను ఆమోదించలేదు. దీంతో ఈ సానుభూతి కాంగ్రెస్‌కు అక్కరకొచ్చింది. ఫలితంగా 2023 ఎన్నికల్లో హస్తం పార్టీకి అవసరమైన దానికంటే ఎక్కువగా సీట్లను కట్టబెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని