Kishan Reddy: భారాస పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం

దేశంలోనే మంచి సంస్థగా పేరొందిన సింగరేణి పదేళ్ల భారాస పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురై, దివాలా తీసేస్థితికి చేరుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 23 Jun 2024 04:29 IST

సంస్థను అప్పులపాలు చేసిన పాపం కేసీఆర్‌దే
దోపిడీపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం తరఫున లేఖ రాస్తా
కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే మంచి సంస్థగా పేరొందిన సింగరేణి పదేళ్ల భారాస పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురై, దివాలా తీసేస్థితికి చేరుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు వరకూ బ్యాంకు ఖాతాల్లో రూ.3,500 కోట్ల డిపాజిట్లు ఉన్న సింగరేణిని రూ.30 వేల కోట్ల అప్పులపాలు చేసిన పాపం కేసీఆర్‌దే అన్నారు. సింగరేణిలో జరిగిన దోపిడీ, అవకతవకలపై న్యాయవిచారణ, సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సంస్థలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు లేఖ రాస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో జరిగిన భూదోపిడీ, భారాస నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్న అంశాలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అహంకారం, అవకతవకలు, అస్తవ్యస్త పాలనా విధానాలతో సింగరేణిని కేసీఆర్‌ అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.

ఎన్నికల్లో ఓటమితో నిరాశా నిస్పృహలు 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే గనుల్ని వేలం వేస్తున్నామని, పార్లమెంటులో ఈ చట్టం చేసినప్పుడు భారాస మద్దతిచ్చి.. ఇప్పుడు విచిత్రవాదన చేస్తోందని మండిపడ్డారు. ‘సింగరేణిని కేసీఆర్‌ కుటుంబం రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. సర్పంచి మొదలుకుని ఎమ్మెల్యే, భారాస మంత్రుల వరకు సింగరేణిని దోచుకున్నారు. ఆ సంస్థను కేంద్రం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందంటూ కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం. సింగరేణికి ఒడిశాలో 2015లో కేటాయించిన నైనీ బ్లాక్‌లో ఇప్పటివరకు ఉత్పత్తే ప్రారంభించలేదు. భాజపాకు వ్యతిరేకంగా నాటి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో కేసీఆర్‌ మంతనాలు జరిపారు. నైనీ బ్లాక్‌ గురించి భారాస ఎందుకు మాట్లాడలేదు?’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్‌ కుటుంబం నిరాశా నిస్పృహల్లో ఉంది. అధికారంలోకి వస్తామంటూ పగటికలలు కంటూ మాట్లాడుతున్నారు. ఆయనపై సానుభూతి చూపించాలి’ అని అన్నారు.

సకాలంలో వేలం వేయాలి.. 

‘రాష్ట్రంలో సున్నపురాయి, ఐరన్‌ ఓర్‌.. గనులకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వేలం నిర్వహించాలి. లేదంటే ఆ అధికారం కేంద్రానికి ఉంటుంది. వేలంతో వచ్చే ఆదాయమంతా రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుంది. రాష్ట్రంలో ఏ ఖనిజం ఎక్కడుందో కేంద్రమే అన్వేషించి చెప్పింది. వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,500 కోట్ల ఆదాయం వస్తుంది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. నామినేషన్‌తో కంటే బహిరంగ వేలం ద్వారానే సింగరేణికి లాభం వస్తుందన్నారు.

కాంగ్రెస్‌ గ్యారంటీలకే గ్యారంటీ లేదు

‘1966-2014 వరకు 48 ఏళ్లలో వరి మద్దతు ధర క్వింటాకు రూ.1,300 పెరిగితే మోదీ పదేళ్ల పాలనలోనే మరో రూ.1,000 పెరిగింది. పత్తికి క్వింటాకు రూ.500 పెరిగింది. మోదీది రైతుల పక్షపాత ప్రభుత్వం. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని సోనియాగాంధీ ప్రకటించి వెళ్లారు. ఉచిత ప్రయాణం తప్ప ఇతర హామీలు అమలు చేయలేదు. కాంగ్రెస్‌ గ్యారంటీలకు గ్యారంటీ లేకుండా పోయింది’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ దగ్గర ధర్నా చేసిన బీజేవైఎం శ్రేణులపై, మహిళలపట్ల విచక్షణరహితంగా లాఠీఛార్జి చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కొత్త బొగ్గు గనుల్ని అన్వేషించాలి

తెలంగాణలో ఖనిజ సంపదపై దృష్టి పెట్టాలని.. కొత్తగా బొగ్గు గనుల్ని అన్వేషించాలని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) అధికారులకు సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథిగృహంలో జీఎస్‌ఐ దక్షిణ భారత, తెలంగాణ, ఏపీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో మరింతగా బొగ్గు దొరికే అవకాశాలు అధికంగా ఉన్నాయని.. ముఖ్యంగా గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఒడిశాలో మహానది, తమిళనాడులో కావేరి నది తీర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని