Kishan Reddy: కేసీఆర్‌లో అభద్రతా భావం కనబడుతోంది: కిషన్‌రెడ్డి కౌంటర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న బడ్జెట్‌పై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో భాజపాపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు

Updated : 02 Feb 2022 18:03 IST

దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న బడ్జెట్‌పై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో భాజపాపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. బుధవారం ఆయన దిల్లీలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రధాని గురించి మాట్లాడుతున్నప్పుడు హుందాగా ఉండాలి. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ గత కొన్ని రోజులుగా భాజపా పైనా, కేంద్ర ప్రభుత్వం పైనా దిగజారి భాషను ఉపయోగిస్తూ అడ్డగోలుగా, అనైతికంగా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, తెరాస మంత్రులు ఒక వ్యూహం ప్రకారం కుట్రపూరితంగా భాజపాపై విషం చిమ్మే కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నారు. రోజూ వరుసల వారీగా కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, వంతుల వారీగా మంత్రులు; అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్‌.. తప్పుడు ప్రచారం, విష ప్రచారం, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ ఆ రాజ్యాంగాన్నే మార్చాలని మాట్లాడటం; ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అవమానించేలా మాట్లాడటం రాజకీయ విలువలకు, నైతిక విలువలకు, మానవీయ విలువలకు జుగుప్సను కలిగించేలా ఉన్నాయి’’ అన్నారు. 

సీఎం అయ్యాకైనా భాష మారాలి కదా!

‘‘ఏ రాజ్యాంగం ఆధారంగా తెలంగాణలో పార్టీ పెట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రాజ్యాంగాన్ని, దాన్ని రూపకల్పన చేసిన అంబేడ్కర్‌ను అవమానించేలా అవహేళనగా సీఎం కేసీఆర్‌ మాట్లాడటం దురదృష్టకరం. కేసీఆర్‌ చేసిన ప్రకటన పట్ల సమాజంలో ఉన్న రాజకీయ విశ్లేషకులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులంతా సిద్ధాంతాలు, రాజకీయాలకతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ దిగజారే భాషను ఉపయోగించారు.. కానీ సీఎం అయ్యాక మార్పు రావాలి. రాజ్యాంగ బద్ధమైన పదువుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే విధానంలో, అభిప్రాయాలు తెలిపే విధానంలో కొంత సంయమనం ఉండాల్సిన అవసరం ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్లేటప్పుడు అక్కడి ప్రజల సంప్రదాయాల్ని గౌరవించేలా ప్రధాని దుస్తులుధరిస్తే దాన్ని విమర్శించడం సీఎం స్థాయివ్యక్తికి తగదు. తొలినుంచి కూడా సీఎం కేసీఆర్‌ చెప్పేదొకటి.. చేసేదిమరొకటి’’ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతేంటి?

‘‘నలుగురిని ఆకట్టుకొనే విధంగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. రెండున్నర గంటల పాటు ఏకపాత్రాభినయం చేస్తూ ప్రయోగించిన భాష యావత్‌ సమాజానికి సంబంధించిన అభిప్రాయం అన్నట్లుగా సీఎం మాట్లాడారు. ఈటల విజయం తర్వాత సీఎంలో, సీఎం కుటుంబంలో అభద్రతా భావం స్పష్టంగా కనబడుతోంది. తనకు నచ్చనిది ఈ సమాజంలో ఎవరికీ నచ్చరాదనే భావనతో వ్యవహరిస్తున్నారు. భాజపాను, కేంద్రాన్ని మీరు విమర్శించే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు పూర్తి చేశారో చెప్పండి. నిన్నటి బడ్జెట్‌పై అనేక రకాలుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కేసీఆర్‌ ప్రయత్నం చేశారు. యూరియాపై సబ్సిడీ తగ్గించినట్టు ప్రచారం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యూరియాపై 33శాతం సబ్సిడీ మొత్తాన్ని పెంచాం. బడ్జెట్‌ అంచనాలు వేరేగా ఉంటాయి. సవరించిన అంచనాలు మారుతాయనేది గుర్తుంచుకోవాలి’’ అంటూ కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు.

రేపు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలకు భాజపా పిలుపు

మరోవైపు, సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా భాజపా రేపు దీక్షలకు పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టనుంది. భాజపా భీం దీక్ష పేరుతో గురువారం భాజపా శ్రేణులు దీక్షలకు సిద్ధమవుతున్నాయి. ఉదయం 10గంట నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మండల కేంద్రాల్లో దీక్ష చేపట్టనున్నారు. అలాగే, భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా నేతలు లక్ష్మణ్‌, రాజాసింగ్‌ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దీక్షలో కూర్చోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని