Kishan Reddy: రాజకీయ లబ్ధి కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు: కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు.

Published : 20 Apr 2022 16:01 IST

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప్పుడు బియ్యం సేకరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. అయినప్పటికీ ధాన్యం కొనుగోలు విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రైతులను అయోమయానికి గురి చేస్తూ రాజకీయ లబ్ధి కోసం అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతా ఒకే విధానం ఉందని.. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను ఒప్పించి.. మెప్పించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు సమావేశాలు నిర్వహించామని.. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరితో ఉందన్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. కేంద్రం, రైతులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేసే ప్రయత్నం చేస్తోందని.. పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని