Kishan Reddy: సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 21 Jun 2024 19:10 IST

హైదరాబాద్‌: బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం లేదన్నారు.

‘‘బొగ్గు గనులు కావాలంటే  అన్ని సంస్థలకు ఒకే విధానం ఉంది. సింగరేణిని అదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయి. వాటిని తప్పకుండా పరిష్కరిస్తాం. దిల్లీ వెళ్లాక దీనిపై అధ్యయనం చేస్తా. సింగరేణి విషయంలో బొగ్గుగనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉంది. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరుతున్నా. కాంగ్రెస్‌, భాజపా ఒకటేనని భారాస, భారాస, భాజపా ఒకటేనని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం సరికాదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందకూడదని కోరుతున్నా. వేలంపాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదు’’ అని కిషన్‌రెడ్డి వివరించారు. 

గత ప్రభుత్వం వేలంలో పాల్గొని గనులు సాధించాల్సింది: భట్టి విక్రమార్క

గత ప్రభుత్వం వేలంలో పాల్గొని గనులు సాధించాల్సిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయించాలని కోరారు. సత్తుపల్లిలో 3, కొయ్యగూడెంలో 3 బొగ్గు గనులు ఉన్నాయన్నారు. ఆరింటిని కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని తెలిపారు. బొగ్గు గనుల కోసం ప్రధానిని.. కిషన్‌రెడ్డి ఒప్పించాలన్నారు. తాను, సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధానితో మాట్లాడేందుకు వస్తామన్నారు. సింగరేణికి వేలంలో రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. అనంతరం సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని