TS News: విజయగర్జన కాదు.. కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి: కిషన్‌రెడ్డి

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, జితేందర్‌రెడ్డి

Updated : 24 Sep 2022 16:42 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, జితేందర్‌రెడ్డి, వివేక్‌, భాజపా శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..  నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా ఈటల రాజేందర్‌ పనిచేశారని అభినందించారు. ‘‘అబద్దాలు చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. కేసీఆర్‌ మాటలను హుజూరాబాద్‌ ప్రజలు నమ్మలేదు. ఈటల రాజేందర్‌ సతీమణి జమున విస్తృతంగా ప్రచారం చేశారు. హుజూరాబాద్‌ ఆడబిడ్డలకు పేరు పేరున నమస్కరిస్తున్నా. హుజూరాబాద్‌ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుంది. ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకే దళితబంధు పథకం తెచ్చారు. తెరాస కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేధావులు పనిచేశారు. హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి. నిజమైన ఉద్యమకారులకు ఉద్వాసన పలుకుతున్నారు.. కానీ, తెలంగాణ వ్యతిరేక శక్తులు ప్రగతి భవన్‌లో ఉన్నాయి. అసలైన ఉద్యమ కారులు తెరాసలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఉద్యమ కారులు, కవులు, కళాకారులు, మేధావులు భాజపాలోకి ఆహ్వానిస్తున్నాం. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. తెలంగాణ ప్రజలు డబ్బుకు లొంగరని హుజూరాబాద్‌ ప్రజలు నిరూపించారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

2023లో భాజపాదే అధికారం: ఈటల

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..‘‘కేసీఆర్‌ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఇక్కడి ఎన్నికల కమిషన్ అధికారులు‌, పోలీసులు పనిచేశారు. అధికార యంత్రాంగం అంతా సీఎం కేసీఆర్‌ ఒత్తిడికి లొంగి పనిచేసింది. సీఐలు, ఎస్సైలు స్థానిక నాయకులను బెదిరించారు. డీజీపీ గారూ.. పోలీసులు బెదిరించిన ఆడియోలు నా దగ్గర ఉన్నాయి. తెరాస కండువా కప్పుకుంటే పనులవుతాయని పోలీసులు బెదిరించారు. ఒక్క ఉప ఎన్నికలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు.. ఎక్కడి నుంచి వచ్చాయి. కేసీఆర్‌ నాయకత్వంలో అరిష్టమైన పాలన సాగుతోంది. 2023లో ప్రజలు తెరాసను పాతరేసి భాజపాను గెలిపిస్తారు’’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

ఇక ఆట మొదలైంది కేసీఆర్‌..
‘‘తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోదు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజలను బానిసలుగా చూస్తున్నారు. ఈ విజయం హుజూరాబాద్‌ ప్రజలకు అంకితం. ఇక ఆట మొదలైంది కేసీఆర్‌. దళితబంధు పథకం పాత ఆలోచన అని కేసీఆర్‌ చెబుతున్నారు. పాత ఆలోచనైతే హూజూరాబాద్‌ ఎన్నిక వరకూ ఎందుకు ఆగారు. దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాల్సిందే. కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో ఒక్క ఎస్సీ కుటుంబమైనా బాగు పడిందా? 20 ఏళ్లు పాలించమని ప్రజలు కేసీఆర్‌కు అధికారమివ్వలేదు.. 2023 వరకే అధికారమిచ్చారు. కేసీఆర్‌కు ఎన్నికలు వచ్చినప్పుడే కొత్త పథకాలు గుర్తుకొస్తాయి. ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. తెరాస మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటా’’ అని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

శంకర్‌ పల్లి నుంచి పార్టీ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ
హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శంకర్‌పల్లి నుంచి భారీ వాహనాలతో ర్యాలీగా హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఈటలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లిలోని భాజపా కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు. హుజూరాబాద్‌ విజయం తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఈటలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని