ప్రజలు నిలదీస్తారనే శిలాఫలకం తీసేశారు

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌, కేటీఆర్‌కు లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 23 Nov 2020 11:27 IST

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌, కేటీఆర్‌కు లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  గోల్నాక డివిజన్‌ భాజపా అభ్యర్థి కత్తుల సరితకు మద్దతుగా  సోమవారం ఉదయం గోల్నాకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు గోల్నాకలో ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఐదేళ్లు పూర్తయినా ఒక్క ఇటుక కూడా వేయలేదు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే శిలాఫలకాన్ని తీసేశారు. ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో ప్రచారానికి వచ్చే తెరాస నేతలను ప్రశ్నించాలి. గత ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలే గెలిచింది. ఈ ఎన్నికల్లో భాజపాపై నగర ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంటుంది’’ అని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

భాజపా ‘బస్తీ నిద్ర’
మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో భాజపా ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు.  ఈ ఉదయం పార్టీ  డివిజన్‌ ఇన్‌ఛార్జిలతో బండి సంజయ్‌ టెలికాన్ఫారెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...బస్తీ నిద్ర కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు సూచించారు. తనతో పాటు పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు వీలైనంత మేరకు బస్తీ నిద్ర చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో భాగంగా సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బస్తీల్లోని ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకొని వారితో మమేకం కావాలని సూచించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని