Kishanreddy: సీఎం కేసీఆర్‌ ఘర్షణాత్మక వైఖరి కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి

అధికారంలో ఎవరున్నా కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని, రాజ్యాంగేతర శక్తులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 25 Jan 2023 20:28 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని ప్రజలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసే పనుల వల్ల రాష్ట్రం పరువుపోతోందన్నారు. కేటీఆర్‌ సీఎం అవ్వరేమోనన్న భయంతో కేసీఆర్‌ ఘర్షణాత్మక వైఖరి కోరుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఎవరున్నా కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని, రాజ్యాంగేతర శక్తులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ సర్కారు సాధించిందేమీ లేదని, అందుకే దిల్లీ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రపోజల్‌ పంపలేదన్నారు. ‘‘గతంలో అనేక సార్లు గవర్నర్లు, ముఖ్యమంత్రులకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ, ఏ సీఎం కూడా ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదు. విచిత్రమైన రాజకీయాలు, వ్యవహారం తెలంగాణలో జరుగుతోంది’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంప పెట్టు: లక్ష్మణ్‌

గణతంత్ర వేడుకల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పరేడ్‌తో గణతంత్ర దినోత్సవం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్‌ ఇప్పటికైనా భేషజాలకు పోకుండా ఉండాలని, ఆయనకు సద్బుద్ధి రావాలని కోరుతున్నట్టు తెలిపారు. ‘‘కరోనా ఉందని సాకు చెప్పడం హాస్యాస్పదం. మీ పార్టీ సభలకు లేని కొవిడ్‌ నిబంధనలు గణతంత్ర దినోత్సవానికి పెట్టడం దారుణం. దేశం గర్వించదగ్గ వేడుకకు రాజకీయాలు ఆపాదించడం దారుణం. మీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు చూసి ప్రజలు చీదరిస్తున్నారు. ప్రతీ సంప్రదాయం కోర్టు ద్వారానే కాపాడాలంటే కష్టం. రాజ్యాంగ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, విధానాలు ఉంటాయి’’ అని లక్ష్మణ్ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని