Kishanreddy: తెలంగాణ, మహిళల కోసమే.. కవిత లిక్కర్‌ వ్యాపారం చేశారా?: కిషన్‌రెడ్డి

అబద్ధాలు ఆడటంలో కల్వకుంట్ల కుంటుంబాన్ని మించిన వారు దేశ రాజకీయాల్లో ఎవరూ ఉండరని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 24 Mar 2023 15:31 IST

దిల్లీ: ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ వ్యాపారం.. తెలంగాణ, మహిళల కోసమే చేశారా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సానుభూతి కోసం కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కల్వకుంట్ల కుటుంబం నాటకాలు ఆడుతోందని అన్నారు. చట్ట సభల్లో మహిళలకు సరైన ప్రాధాన్యం ఇవ్వని భారాసకు మహిళా రిజర్వేషన్లు ఇప్పుడే గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు. అక్రమార్కులను దోషులుగా నిలబెట్టడమే దర్యాప్తు సంస్థల పని అన్న కిషన్‌రెడ్డి.. అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

‘‘అబద్ధాలు ఆడటంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వారు దేశ రాజకీయాల్లో ఎవరూ ఉండరు. ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అన్న చందంగా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తోంది. నేను సీఎం కుమార్తెను.. నా మీద కేసు ఎట్లా పెడతారు? నేనొక మహిళను, తెలంగాణ బిడ్డను అని కవిత అంటున్నారు. మీరు దిల్లీకి వెళ్లండి, అక్కడ మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండని తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా? దిల్లీ వెళ్లి ఆప్‌తో కలిసి అక్రమంగా మద్యం వ్యాపారం చేయాలని తెలంగాణ ఆడబిడ్డలు చెప్పారా? ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ, ఆడబిడ్డలు కానీ.. సీఎం కుమార్తె చేసిన పని కారణంగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. మద్యం కుంభకోణంలో ఒక మహిళ  ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఇప్పటికే తెలంగాణను మద్యానికి అడ్డాగా మార్చారు. కేంద్రం గురించి కేటీఆర్‌, కవిత అబద్ధాలు మాట్లాడారు. ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన పార్టీ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతారా? ఈడీ నోటీసు రాగానే మహిళా రిజర్వేషన్‌ గుర్తుకు వచ్చిందా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని