ఇతరులకూ ఛాన్స్‌ రావాలి కదా: శైలజ 

కేరళలో చారిత్రక విజయంతో వరుసగా రెండోసారి సీపీఎం నేతృత్వంలో కొలువుదీరిన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంలో తనకు మళ్లీ మంత్రిగా ఛాన్స్‌ రాకపోవడంపై.......

Published : 19 May 2021 01:28 IST

తిరువనంతపురం: కేరళలో చారిత్రక విజయంతో వరుసగా రెండోసారి సీపీఎం నేతృత్వంలో కొలువుదీరే ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంలో తనకు మళ్లీ మంత్రిగా ఛాన్స్‌ రాకపోవడంపై మాజీ మంత్రి కేకే శైలజ స్పందించారు. ఇది పార్టీ తీసుకున్న సమష్టి నిర్ణయమన్నారు. కొత్త ముఖాలకు కేబినెట్‌లో చోటు కల్పించేందుకే పార్టీ ఈ నిర్ణయం తీసుకొందని.. ఇది చాలా మంచి నిర్ణయమన్నారు. ఇతరులకు కూడా మనం కచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఆమె వ్యాఖ్యానించారు. తానొక్కరికే కాదని, గత కేబినెట్‌లో ఉన్న ఎవరికీ ఈసారి చోటుదక్కలేదని గుర్తుచేశారు. పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని తాను అంగీకరిస్తున్నానన్నారు. తమ పార్టీలో అనేకమంది కార్యకర్తలు ఉన్నారని, వారికి అవకాశం వస్తే వాళ్లూ కష్టపడి పనిచేస్తారన్నారు. గత ఐదేళ్లలో మంత్రిగా సహచరులతో కలిసి నిజాయతీగా కష్టపడి పనిచేసినందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. కరోనా, నిఫా వంటి కఠినమైన పరిస్థితులు, సవాళ్లు ఎదురైనప్పుడు తామంతా సమష్టిగా పనిచేసి ఎదుర్కోగలిగామన్నారు.

కేరళలో శైలజ టీచర్‌గా పేరొందిన కేకే శైలజ.. కేరళ ఆరోగ్య మంత్రిగా నిఫా వైరస్‌తో నెలకొన్న సంక్షోభాన్ని, కరోనా కట్టడిలోనూ సమర్థంగా పనిచేసి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. యూకేకు చెందిన ఓ మ్యాగజీన్‌ ఆమెను టాప్‌ థింకర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా కూడా ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మట్టన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన శైలజకు 61.97% ఓట్లు వచ్చాయి. మరోవైపు, కేరళ కొత్త కేబినెట్‌లో సీఎం పినరయి విజయన్‌ తప్ప మిగతా మంత్రులందరూ కొత్త వారే కావడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని