Bhupendra Patel: మోదీ రికార్డునే బ్రేక్‌ చేసి.. భూపేంద్ర పటేల్‌ గురించి ఈ విశేషాలు తెలుసా?

అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తొలిసారే ముఖ్యమంత్రి బాధ్యతలు అందుకున్న భూపేంద్ర పటేల్‌.. వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..

Updated : 12 Dec 2022 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌(Gujarat) ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ (Bhupendra Patel) వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ఆయనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. భూపేంద్రతో పాటు మరో 16 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) సహా కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, శివరాజ్‌ సింగ్ చౌహన్‌ తదితరులు హాజరయ్యారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పటేల్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రికార్డునే బద్దలు కొట్టి అత్యధిక మెజార్టీతో సీఎం బాధ్యతలు అందుకున్నారు. 182 స్థానాలున్న గుజరాత్‌ శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో భాజపా 156 స్థానాలు గెలుచుకుని వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా స్థానం నుంచి పోటీ చేసిన భూపేంద్ర 1.92 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా భూపేంద్రుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే..

2021 సెప్టెంబరులో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్‌ రూపానీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించి భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించారు. రూపానీ రాజీనామా తర్వాత అనేక మంది సీనియర్‌ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని పటేల్‌కు సీఎం బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే, భూపేంద్ర పటేల్‌ అప్పటికి ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఒక్కసారే. 2017 ఎన్నికల్లో ఆయన గెలుపొంది మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కీలక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితులై భూపేంద్ర పటేల్‌ అరుదైన ఘనత సాధించారు.

మోదీ రికార్డునే బద్దలుకొట్టి..

2002లో నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో భాజపా 127 స్థానాల భారీ మెజార్టీతో విజయం సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలుకొట్టారు. ఏకంగా 156 మంది ఎమ్మెల్యేల బలగంతో సీఎం బాధ్యతలు అందుకోబోతున్నారు. ఇక, మోదీకి, భూపేంద్ర పటేల్‌కు ఓ సారూప్యత కూడా ఉంది. పటేల్‌ ఎలాంటి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం లేకుండానే గతేడాది తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ప్రధాని మోదీ కూడా ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండానే గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

పాటీదార్‌ వర్గం నుంచి ఐదో సీఎం..

రూపానీని గద్దెదించి భూపేంద్ర పటేల్‌కు సీఎం పగ్గాలు అప్పగించడం వెనుక గుజరాత్‌లో జరిగిన పాటీదార్‌ వర్గ ఆందోళనే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. పాటీదార్ల డిమాండ్‌ మేరకే భాజపా ఈ నిర్ణయం తీసుకుంది. అది కలిసొచ్చి తాజా ఎన్నికల్లో పాటీదార్ల ప్రాబల్యమున్న స్థానాల్లో భాజపా ఘన విజయం సాధించింది. అందుకే రెండో దఫా కూడా ఆయనకే సీఎం బాధ్యతలు కట్టబెట్టింది. పటేల్‌ వర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఐదో వ్యక్తి భూపేంద్ర. అంతకుముందు ఆనందీబెన్‌ పటేల్‌, కేశుభాయ్‌ పటేల్‌, బాబుభాయ్‌ పటేల్, చిమన్‌భాయ్‌ పటేల్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆరంభమే రికార్డు..

గుజరాత్‌ మాజీ సీఎం, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు భూపేంద్ర అత్యంత నమ్మకస్థుడు. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 2017లో తొలిసారి పోటీ చేసిన ఆయన..  1.17 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి శక్తికాంత్‌ పటేల్‌పై ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఘట్లోడియా స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన ఆయన .. ఈ సారి ఏకంగా 1.92లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మరో ఘనత దక్కించుకున్నారు.

ఇతర విశేషాలు..

* 60 ఏళ్ల భూపేంద్ర పటేల్‌ అహ్మదాబాద్‌లో జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు.

* అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా, పురపాలక సంఘం స్థాయీ సంఘం ఛైర్మన్‌గా, మున్సిపల్‌ పాఠశాలల కమిటీ ఉపాధ్యక్షునిగా పనిచేశారు.

* ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన మృదుభాషి. అందరూ ‘దాదా’ అని ఆప్యాయంగా పిలుస్తారు.

* పటేల్‌పై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవు. రాజకీయాల్లోకి రాకముందు నిర్మాణ రంగ వ్యాపారం నిర్వహించేవారు. ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ అనుబంధం ఉంది. భాజపాలో ఈయనను ట్రబుల్‌ షూటర్‌, వ్యూహకర్తగా పిలుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని