Kodela Sivaram: కోడెలపై పెట్టిన సెక్షన్లతోనే జగన్‌పైనా కేసు పెట్టాలి

తాడేపల్లిలోని తన ఇంటికి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అప్పట్లో రూ.18 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని, దాంతోనే అక్కడ విద్యుత్‌ ఫెన్సింగ్‌ సహా పలు రకాల సామగ్రి సమకూర్చుకున్నారని, ఆ సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించకపోగా.. అదే ఇంట్లో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు నిర్వహించడమేంటని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ధ్వజమెత్తారు.

Updated : 16 Jun 2024 06:44 IST

తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-నరసరావుపేట అర్బన్‌: తాడేపల్లిలోని తన ఇంటికి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అప్పట్లో రూ.18 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని, దాంతోనే అక్కడ విద్యుత్‌ ఫెన్సింగ్‌ సహా పలు రకాల సామగ్రి సమకూర్చుకున్నారని, ఆ సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించకపోగా.. అదే ఇంట్లో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు నిర్వహించడమేంటని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ధ్వజమెత్తారు. ఈ విషయమై శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇప్పుడు జగన్‌ తన ఇంట్లో సీఎంఓ కింద తెచ్చిన ఫర్నిచర్, సామగ్రి ఇస్తానని కనీసం లేఖ కూడా రాయలేదు. స్పీకర్‌ హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సామగ్రి మావద్దే ఉందని, దానిని తీసుకెళ్లాలని, లేదా విలువ చెబితే చెల్లిస్తామని మేం లేఖ రాసినా కూడా తప్పుడు కేసులు పెట్టి వేధించారు. అప్పట్లో మేం వైకాపా ప్రభుత్వ తొలి బాధితులం అయ్యాము. అప్పుడు దివంగత నేత డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుపై పెట్టిన సెక్షన్ల కిందే ఇప్పుడూ జగన్‌ మీదా కేసులు పెట్టాలి.

నాడు కోడెల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వైకాపా నేతలపై సీఎం చంద్రబాబు సమగ్ర విచారణ చేయించి వారిని ప్రజాకోర్టులో నిలబెట్టాలని కోడెల కుమారుడిగా కోరుకుంటున్నాను. అధికారంలో ఉన్నప్పుడు అడ్డూ అదుపూ లేకుండా సొంత ఇంటికి జగన్‌ ఖర్చుచేసిన ప్రజాధనం, సౌకర్యాల పేరుతో చేసిన వ్యయం దృష్ట్యా ఆయనపై కేసు నమోదుచేయాలి. అప్పట్లో కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తరలించారని తప్పుడు కేసు పెట్టి పదేళ్ల శిక్ష పడే సెక్షన్లతో కేసు నమోదుచేశారు. మేం ఇచ్చిన వివరణను సైతం పరిగణనలోకి తీసుకోకుండా వేధించారు. రెండుసార్లు లేఖ రాయడంతో పాటు ఆరోపణలపై వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. నాడు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. నేడు అదే జగన్‌ తాడేపల్లి ఇంటికి రూ.18 కోట్ల ప్రజాధనం ఖర్చుచేశారు. దాన్ని ఇప్పుడు తన పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇప్పటివరకు సామగ్రి అప్పజెప్పనందుకు కోడెల మీద పెట్టిన కేసు ఇప్పుడు జగన్‌ మీద ఎందుకు పెట్టకూడదు’’ అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కోడెల అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతూ జగన్‌ను నిలదీయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని