Kollu Ravindra: ఎక్సైజ్, గనుల శాఖలను భ్రష్టు పట్టించారు

‘అక్రమ మద్యం ద్వారా ఎక్సైజ్‌ శాఖను, ఇసుక, ఇతర ఖనిజాల దోపిడీతో గనులశాఖను గత ఐదేళ్లలో పూర్తిగా భ్రష్టుపట్టించారు. రెండింటినీ ప్రక్షాళన చేస్తాం.

Published : 25 Jun 2024 06:10 IST

తప్పుడు బ్రాండ్లు సృష్టించి ప్రజల ప్రాణాలు తీశారు
భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులను వదిలిపెట్టం
రెండు శాఖల్లో త్వరలో మెరుగైన విధానాలు
ఎక్సైజ్, గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర

సచివాలయంలో భూగర్భ, గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కొల్లు రవీంద్ర  

ఈనాడు, అమరావతి: ‘అక్రమ మద్యం ద్వారా ఎక్సైజ్‌ శాఖను, ఇసుక, ఇతర ఖనిజాల దోపిడీతో గనులశాఖను గత ఐదేళ్లలో పూర్తిగా భ్రష్టుపట్టించారు. రెండింటినీ ప్రక్షాళన చేస్తాం. మంచి విధానాలు తీసుకొస్తాం’ అని ఎక్సైజ్, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన ఈ రెండు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వంలో డిస్టిలరీలను నిర్వీర్యం చేశారు. వారి స్వార్థం కోసం సొంత కంపెనీలు, తప్పుడు బ్రాండ్లు సృష్టించి, వాటిని ప్రజలపైకి వదిలారు. వీటితో ఎందరివో ప్రాణాలు పోయాయి. వీరి విధానాల వల్ల విపరీతంగా గంజాయి, అక్రమ మద్యం పెరిగిపోయింది. సారా తాగి జంగారెడ్డిగూడెంలో 50-60 మంది చనిపోయారు. ఇవేమీ పునరావృతం కాకుండా చూస్తాం. గతంలో జరిగిన అక్రమాలను కచ్చితంగా బయటకుతీసి, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి చెప్పారు.


ఇసుకలో ఏం జరుగుతుందో లెక్కల్లేవు

‘రాష్ట్రమంతటా ఇసుక, మైనింగ్‌లో దోచుకున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి జమచేయకుండా, సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసేవారిని రాష్ట్రం నుంచి తరిమేశారు. గత సీఎం, మంత్రి కొందరు ఏజెంట్లను పెట్టుకొని ఈ శాఖను సర్వనాశనం చేశారు. ఎంత ఇసుక తీసుకెళుతున్నారు? ఎంత బయటకెళుతోంది? ప్రభుత్వానికి లెక్క చెబుతున్నది ఎంత? వంటి వివరాలేవీ లేవు. గతంలో చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అమలు చేసినప్పుడు రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లు సహా అంతటా పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు ఇసుక కొరత లేకుండా ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. మచిలీపట్నం నుంచి 50 వేల మెజారిటీతో అవకాశమిచ్చిన బందరు నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న ఓఎన్‌జీసీ పెట్రోలియం బ్లాక్‌ లీజు పునరుద్ధరణ దస్త్రంపై మంత్రి తొలి సంతకం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని