Rajagopal Reddy: ఆ నలుగురు మంత్రులు ఉద్యమకారులా?: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తెరాస.. తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విమర్శించారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది 

Updated : 08 Aug 2022 13:31 IST

స్పీకర్‌కు రాజీనామా లేఖ అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే

హైదరాబాద్‌: తెరాస.. తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆయన అందజేశారు. తన రాజీనామాను సభాపతి ఆమోదించినట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు.
తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం..

‘‘తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించా. దీనిలో తెలంగాణ, మనుగోడు ప్రజలు గెలుస్తారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నా. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం అరాచక పాలన కొనసాగిస్తోంది. నేను రాజీనామా అంటే కేసీఆర్‌ దిగొస్తున్నారు. నా రాజీనామాతో జరిగే ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారు. తెలంగాణకు కేసీఆర్‌ నుంచి విముక్తి కల్పిస్తారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలవాలని చూస్తే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. నన్ను గెలిపించి ప్రజలు పాపం చేశారా? ఉప ఎన్నికపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నా మునుగోడు ప్రజలపై ఉన్న నమ్మకంతో రాజీనామా చేసి తీర్పు కోరుతున్నా. సోషల్‌ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

కేసీఆర్‌కు ఆ నియోజకవర్గాలు తప్ప మిగతావి కనిపించవు...

ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం, పేదలకు ఇళ్లు, పింఛన్ల కోసం రాజీనామా చేశా. నేను రాజీనామా అనగానే గట్టుప్పల్‌ మండలం ఏర్పాటు చేస్తున్నారు. సీఎంకు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ తప్ప ఇతరుల నియోజకవర్గాలు కనిపించడం లేదు. ప్రాజెక్టులు కట్టొద్దని మేం చెప్పలేదు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఏమైంది? మిషన్‌ భగీరథలో రూ.25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా? జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెరాస తెలంగాణ ద్రోహుల పార్టీగా మారింది. మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌ ఉద్యమకారులా? తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు.

ఆ భాషతో తెలంగాణ సమాజం తలదించుకుంటోంది

చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తల దించుకుంటోంది. అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడు.. సీఎం కూడా అవుతారంట. డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు.. తప్పుడు పనులతో జైలుకెళ్లి వచ్చినవారు మాట్లాడుతున్నారు. ఏ త్యాగం చేయకుండా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. కోమటిరెడ్డి సోదరులను తిట్టించిన భాష విన్న తర్వాత అందరూ ఆలోచించాలి’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు