కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు: కోమటిరెడ్డి

తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్నా సీఎం కేసీఆర్‌ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ..

Published : 19 Apr 2021 01:18 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్నా సీఎం కేసీఆర్‌ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రె‌డ్డి ఆరోపించారు. ఈ మేరకు  సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారని ప్రశ్నించారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్టులకూ టెస్టులు చేయాల్సిన సర్కార్ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని.. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు.

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఏమైందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కొవిడ్‌ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రాష్ట్ర ప్రజలందరికీ చికిత్స అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు సరిపోకపోవడంతో బాధితులు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరుతూ లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఉందని చెప్పారు. పేద ప్రజలకు కరోనా చికిత్స అందక ఇబ్బందులు పడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకపోతే కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని