రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు: కోమటిరెడ్డి

ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు 24గంటలూ అందుబాటులో ఉంటానని.. ఇతర రాజకీయాల్లోకి తనని లాగొద్దని భువనగిరి

Updated : 28 Jun 2021 19:30 IST

హైదరాబాద్‌: ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు 24గంటలూ అందుబాటులో ఉంటానని.. ఇతర రాజకీయాల్లోకి తనని లాగొద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇక నుంచి రాజకీయపరమైన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. భువనగిరి, నల్గొండ, పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వివరించారు. అదే విధంగా గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు, పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాల‌ని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీక్‌ ఫౌండేష‌న్ ద్వారా వీలైనంత ఎక్కువ‌గా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు జాప్యం వ‌ల్ల న‌ల్గొండ జిల్లాలో వేలాది ఎక‌రాలు బీడు వారుతోందని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తాన‌ని అన్నారు. అలాగే 90శాతం పూర్తయిన బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు మరో వంద కోట్లు ఖ‌ర్చు చేస్తే వేల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌న్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. వీటితో పాటు భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలోని గంధ‌మ‌ల్ల‌, బ‌స్వాపురం రిజ‌ర్వాయ‌ర్లు త్వరగా అందుబాటులోకి వ‌చ్చేలా స‌ర్కార్‌పై ప్రజల ప‌క్షాన పోరాడతానని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని