Telangana News: మూసీ సమస్యపై ప్రధాని మోదీ దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మూసీ నదిలో శుద్ధి చేయని రసాయన వ్యర్థాలు, మురుగు జలాలు కలవడం వల్ల లక్షలాది మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం...

Updated : 16 Mar 2022 20:55 IST

దిల్లీ: మూసీ నదిలో శుద్ధి చేయని రసాయన వ్యర్థాలు, మురుగు జలాలు కలవడం వల్ల లక్షలాది మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సమస్యను కోమటిరెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. నమామి గంగే వంటి కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ మూసీపైనా దృష్టి సారించాలని కోమటిరెడ్డి కోరారు.

‘‘ఇది తెలంగాణకు చెందిన గంభీరమైన సమస్య. మూసీ తెలంగాణ నది. వికారాబాద్‌లో మొదలై రంగారెడ్డి జిల్లా మీదుగా ప్రవహిస్తూ కృష్ణాలో కలుస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కలుషిత జలాలు మూసీలో కలుస్తున్నాయి. నా నియోజకవర్గం పరిధిలో 150 కి.మీ. మేర మూసీ ప్రవహిస్తోంది. నాలుగో వంతు ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. నమామి గంగే పథకంలో భాగంగా గంగా నది ప్రక్షాళన చేస్తున్నట్లుు మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలని కోరుతున్నాను. అలా చేయకపోతే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫార్మా సంస్థలు కూడా శుద్ధి చేయని జలాలను నదిలోకి వదిలేస్తున్నాయి. ఈ విషయాన్ని పరిశీలించాలి’’ అని కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

హైవేల నిర్మాణంలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలి: రేవంత్‌ రెడ్డి

జాతీయ రహదారుల నిర్మాణంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు. యూపీఏ హయాంలో 37 శాతంగా ఉన్న ప్రైవేటు భాగస్వామ్యాన్ని 7 శాతానికి తగ్గించారని తెలిపారు. ఉపరితల రవాణా, రహదారుల అంశంపై  లోక్‌సభలో మాట్లాడిన రేవంత్‌.. తెలుగు రాష్ట్రాల్లోని పలు జాతీయ రహదారులను విస్తరించాలని కోరారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. భారత్‌ మాల పథకంలో భాగంగా చేపట్టిన జాతీయ రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్-విజయవాడ రహదారిని విస్తరించాలని.. 4లేన్ల హైవేను 6 లేన్లుగా విస్తరిస్తామని నిధులు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ పనులను చేపట్టడం లేదన్నారు. ఇదే కాకుండా తెలంగాణలోని ఇంకొన్ని హైవేలకు నిధులు ప్రకటించినప్పటికీ పనుల ప్రారంభించలేదని వెల్లడించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని