Congress: కాంగ్రెస్‌లో కమిటీల కలకలం.. పీసీసీఈసీ సభ్యత్వానికి కొండా సురేఖ రాజీనామా

ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్‌ కమిటీలు తనకు అసంతృప్తిని కలిగించాయని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు.

Updated : 11 Dec 2022 17:28 IST

హైదరాబాద్‌: ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్‌ కమిటీలు తనకు అసంతృప్తిని కలిగించాయని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ‘‘తెలంగాణ పీఏసీలో నా పేరు లేకపోవడమే కాదు వరంగల్‌ జిల్లాకు సంబంధించి ఏ నాయకుడి పేరు లేకపోవడం మనస్తాపం కలిగించింది. తెలంగాణ ప్రదేశ్‌ రాజకీయ వ్యవహారాల కమిటీలో నాకంటే జూనియర్లకు అవకాశం ఇచ్చారు. నన్ను మాత్రం తెలంగాణ ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నా.

తెలంగాణ ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో నన్ను నియమించడం అవమానపరిచినట్టుగా భావిస్తున్నా. నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యం. మా కుటుంబం 34 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అభిమానించే వారు ఉన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో రాజకీయ బతుకుదెరువుకోసం మూటముల్లె సర్దుకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో నిండిపోయింది. కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని వాళ్లను, నామినేట్‌ చేసిన కమిటీలో నన్ను నామినేట్‌ చేయడం అవమానపర్చినట్టుగా భావిస్తున్నా. నేను, నా భర్త వరంగల్‌ ఈస్ట్‌, పరకాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్య కార్యకర్తలుగా కొనసాగుతాం’’ అని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని