Munugode bypoll results: కమ్యూనిస్టుల మద్దతుతోనే మునుగోడులో తెరాస విజయం: కూనంనేని

వామపక్ష శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత మునుగోడు ఉప ఎన్నిక ద్వారా మరోసారి స్పష్టమైందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టుల మద్దతుతోనే మునుగోడులో తెరాస గెలిచిందన్నారు.

Published : 06 Nov 2022 17:36 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో భాజపా ఓటమి ఒక్క రాజగోపాల్‌రెడ్డికే కాదు, నరేంద్రమోదీకి చెంపపెట్టు లాంటి తీర్పు అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌లోని ముగ్దూం భవన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. డబ్బులు ఉన్నాయి, భాజపా అండ ఉంది కాబట్టి గెలవొచ్చని భావించారు. కానీ, ఇవాళ మా నైతిక విజయమని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు. మునుగోడులో భాజపా ఓటమి, తెరాస గెలుపు.. ప్రజాస్వామ్యానికి లభించిన విజయంగా మేం భావిస్తున్నాం. మునుగోడు ఫలితం భాజపా వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి దోహద పడుతుంది.

వామపక్ష శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత మునుగోడు ఉప ఎన్నిక ద్వారా మరోసారి స్పష్టమైంది. తెలంగాణలో పాగా వేయాలని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని భాజపా చూస్తోంది. గతంలో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈసారి ఆ పార్టీ గెలవలేదు. మునుగోడులో కాంగ్రెస్‌కు పెద్ద తలకాయ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ కార్యకర్తలకు రాజగోపాల్‌రెడ్డికే ఓటు వేశారు. కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు. భవిష్యత్‌లో తెరాస, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉండే అవకాశముంది. భాజపాను ఓడించే శక్తితో కలిసి పనిచేసేందుకు వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భాజపాను తెలంగాణలో అడుగుపెట్టనివ్వకుండా చేస్తాం. కమ్యూనిస్టుల మద్దతుతోనే మునుగోడులో తెరాస గెలిచింది. భాజపాను ఓడించేందుకు అందరం కలవాల్సిన అవసరముంది’’ అని కూనంనేని సాంబశివరావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని