kotamreddy giridhar reddy: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 24 Mar 2023 15:44 IST

మంగళగిరి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంపై తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు గాలి మాత్రమేనని రాబోయే ఎన్నికల్లో సునామీ వస్తుందని వైకాపాను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. ఈ సునామీలో వైకాపా నేతలు అడ్రస్‌ లేకుండా కొట్టుకొనిపోవడం ఖాయమని అన్నారు. వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి శుక్రవారం తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో నిరంతరం ఉంటూ సమాజానికి సేవ చేయాలనే తపన ఉండే వ్యక్తి గిరిధర్‌రెడ్డి అని అన్నారు. వైకాపా సేవ దళ అధ్యక్షుడే రాజీనామా చేశాడంటే ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మరికొందరు నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారందర్నీ చంద్రబాబు సదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

నెల్లూరులో 10స్థానాలు తెదేపా గెలుస్తుంది : కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. “తెలుగుదేశం కుటుంబంలో నన్ను భాగస్వామిని చేసిన చంద్రబాబుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాకే తెదేపాలో చేరాను. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను తెదేపా గెలుస్తుంది. మాతోపాటు మమ్మల్ని నమ్ముకొని ఈ పార్టీలోకి వచ్చిన వారందరికీ  ధన్యవాదాలు’’ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని