Koushik reddy: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా

హుజురాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Updated : 12 Jul 2021 16:38 IST

హుజూరాబాద్‌: హుజురాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఆ సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజురాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది.

మాదన్నపేటకు చెందిన విజేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని..  ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజేందర్‌కు కౌశిక్‌రెడ్డి సూచించారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను కౌశిక్‌రెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన జరిపిన ఫోన్‌ సంభాషణ బయటకు రావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పార్టీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. 24గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ కౌశిక్‌ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని