TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్‌... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్‌.. భాజపా ఎమ్మెల్యేల వద్దకు వచ్చి పలు అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారు.

Updated : 03 Feb 2023 23:35 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ వద్దకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది. హుజూరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. 

ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్‌ సరిగా లేదని కేటీఆర్‌కు ఈ సందర్భంగా ఈటల హితవు పలికారు. వారి మధ్య సంభాషణ జరుగుతుండగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన ప్రస్తావించారు. మళ్లీ ఈటల కలుగజేసుకుని కనీసం కలెక్టర్‌ నుంచైనా ఆహ్వానం ఉండాలన్నారు. ఆయన వ్యాఖ్యలకు కేటీఆర్‌ నవ్వి ఊరుకున్నారు.

ఆ తర్వాత రాజాసింగ్‌, కేటీఆర్‌ మధ్య కూడా సరదా సంభాషణ జరిగింది. కాషాయ రంగు చొక్కా వేసుకొచ్చిన రాజాసింగ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. చొక్కా రంగు కళ్లకు గుచ్చుకుంటుందని.. ఆ రంగు తనకు ఇష్టం ఉండదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కాషాయ రంగు చొక్కా భవిష్యత్‌లో మీరూ వేసుకోవచ్చేమో అని రాజాసింగ్‌ సరదాగా అన్నారు. మరోవైపు గవర్నర్‌ సభలో వస్తున్నారంటూ మంత్రిని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అలెర్ట్‌ చేయగా.. ఆయన తన ట్రెజరీ బెంచీల వైపు వెళ్లిపోయారు. కేటీఆర్‌ కంటే ముందు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ వచ్చి ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు