KTR: నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా నేను సిద్ధమే!

రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో

Updated : 30 Sep 2022 14:47 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆయన.. అక్కడ తెరాస ఎలాగూ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డినా.. సీనియర్‌ నేత జానారెడ్డి ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గజ్వేల్‌లోనే కాదు.. ఎక్కడ సభపెట్టినా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ అయినా దక్కుతుందా?అని ప్రశ్నించారు.

ఎవరో ఏదో చేస్తే నాకేంటి సంబంధం?

‘‘మేం సంక్షేమంలో నిమగ్నమయ్యాం. హుజూరాబాద్‌లో తెరాస కచ్చితంగా గెలుస్తుంది. రూ.50కోట్లతో పీసీసీ కొనుక్కున్నారని ఆ పార్టీ నేతే అన్నారు. పీసీసీ పదవి కొనుక్కున్న నేత రేపు ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోరా? పెయింటింగ్‌ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయి? ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి.. ఇవాళ కన్నమేస్తున్నారు. నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా నేను సిద్ధం. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం? ఇక నుంచి ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతాం.  ఎంఐఎంకు  ఎవరూ భయపడట్లేదు.. భాజపానే భయపడుతోంది. ఆదిలాబాద్‌కు గిరిజన వర్సిటీ ఇస్తామన్న భాజపా ఏం చేసింది? రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులపై అమిత్‌ షా మాట్లాడాలి’’ అని అన్నారు. 

దిల్లీ పార్టీలవి సిల్లీ పాలిటిక్స్‌!

ఎంపీలుగా గెలిచిన భాజపా ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారు? దిల్లీ పార్టీలు సిల్లీ పాలిటిక్స్‌ చేస్తున్నాయి. కొత్త పార్టీలు ఎందుకు పుట్టాయో ప్రజలకు తెలుసు. కొత్త పార్టీలు కేసీఆర్‌ మీద మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌, భాజపాపై షర్మిల, ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడరెందుకు? అడ్రస్‌లేని వ్యక్తులు కేసీఆర్‌ని తిడితే ఊరుకోం. సైదాబాద్‌లో బాలిక ఘటనపై చట్టం తన పని తాను చేసుకుపోయింది. దిశ ఘటనపై దేశం హర్షించింది’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని