KTR: రాజకీయ ప్రయోజనాల కోసం భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు?: కేటీఆర్‌

రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 10 Jul 2024 10:49 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు నిధుల సమీకరణకు ఓ ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన పోస్టు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను.. ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని సర్కారు భావిస్తోందని ఆరోపించారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పారు. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడుతందన్నారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావని తెలిపారు. 

‘‘కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం స్తబ్ధుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని