KTR: ప్రైవేటీకరణకు భాజపా, కాంగ్రెస్‌ కుట్ర

తెలంగాణకే తలమానికమైన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు భాజపా, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పన్నుతున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

Updated : 21 Jun 2024 03:12 IST

బొగ్గు గనులను కార్పొరేట్‌ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు
అందుకే కేంద్రం వేలం వేస్తామంటే.. రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోంది
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధ్వజం
ఏపీలో 16 ఎంపీ సీట్లు రావడంతో వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ కాకుండా తెదేపా ఆపగలుగుతోందని వ్యాఖ్య 

తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, పక్కన జగదీశ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకే తలమానికమైన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు భాజపా, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పన్నుతున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధ్వజమెత్తారు. బొగ్గు గనులను కార్పొరేట్‌ గద్దలకు కేటాయించేందుకు ఆ రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కయ్యాయని, సింగరేణి మెడ మీద కేంద్రం కత్తిపెడితే.. ఆ కత్తికి సాన పెడుతున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘నష్టాల పేరిట వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఎలా ఖతం చేశారో.. అలాగే సింగరేణిని కూడా చేసేందుకు ఆ రెండు జాతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే గనులు కేటాయించకుండా వేలం కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. వేలం పాటలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు పాల్గొంటోందో చెప్పాలి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రెస్, భాజపాలకు చెరో 8 ఎంపీలను ఇస్తే.. వారు రిటర్న్‌ గిఫ్ట్‌గా సింగరేణిని నిట్ట నిలువునా ముంచే పని చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష భారాస పార్టీ మాత్రమే. ఇప్పుడు కూడా సింగరేణిని మళ్లీ భారాసయే కాపాడుకుంటుంది’’ అని స్పష్టం చేశారు. బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.


అప్పుడు వేలం వద్దన్న రేవంత్‌.. 

‘‘మాకు 16 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్‌ చెబితే.. 16 సీట్లతో ఏం చేస్తారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రశ్నించారు. భారాసకు 16 ఎంపీ సీట్లు ఇవ్వడం ఎందుకు కీలకమో.. ఇప్పుడు బొగ్గు గనుల వేలం ద్వారా స్పష్టమవుతోంది. ఏపీలో తెదేపాకు 16 సీట్లు వస్తే.. అక్కడ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలుగుతోంది. కానీ చెరో 8 సీట్లు గెలిచిన కాంగ్రెస్, భాజపాలు మన సింగరేణిని ఖతం చేస్తున్నాయి. మన బొగ్గు గనులను దుర్మార్గంగా వేలం వేయబోతున్నారు. గతంలోనే వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని అప్పటి సీఎం కేసీఆర్‌ కేంద్రానికి ఉత్తరం రాశారు. అదే సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా సింగరేణికి కోల్‌ బ్లాక్‌ల వేలం ఉండొద్దని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని.. ఇప్పుడు కోల్‌ బ్లాక్‌ల వేలానికి ముఖ్యమంత్రి మద్దతు తెలుపుతున్నారు? కేసుల భయమా? రేవంత్‌రెడ్డికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు భాజపా ప్రభుత్వమే గనులను కేటాయించింది. తమిళనాడులో ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కోరితే.. అక్కడ కూడా వేలం లేకుండా గనులు కేటాయించారు. మరి తెలంగాణలో సింగరేణికి ఎందుకు గనులను కేటాయించటం లేదు? మన రాష్ట్రం నుంచే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. రాష్ట్రానికి మంచి చేయాల్సింది పోయి నష్టం చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయానికి సీఎం, డిప్యూటీ సీఎంలు ఎందుకు వంత పాడుతున్నారు? వేలంలో ఎందుకు పాల్గొనబోతున్నారో సమాధానమివ్వాలి. వేలం పాటలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడమంటే.. సింగరేణి ప్రైవేటీకరణకు అంగీకరిస్తున్నట్లే. వేలంలో పాల్గొనబోయే ప్రైవేట్‌ కంపెనీలను మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. నాలుగున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారాస ప్రభుత్వమే. అప్పుడు ఈ నిర్ణయాన్ని సమీక్షించి అడ్డుకుంటాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని