KTR Vs Bandi: బండి సంజయ్‌పై కేటీఆర్‌ పరువునష్టం దావా.. న్యాయవాది ద్వారా నోటీసులు జారీ

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన న్యాయవాది ద్వారా బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు జారీ చేశారు

Updated : 14 May 2022 18:55 IST

హైదరాబాద్: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన న్యాయవాది ద్వారా బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సంజయ్ చేసిన ఆరోపణలపై స్పందించిన కేటీఆర్‌.. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని బండి సంజయ్‌ని హెచ్చరించారు. అయినా ఆధారాలు భయటపెట్టక పోవడంతో ఇవాళ బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేశారు.

మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా.. కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్‌కి ఆపాదించాలనే దురుద్దేశంతో ఆరోపణలు చేశారని న్యాయవాది తెలిపారు. కేటీఆర్ పరువుకు నష్టం కలిగించేలా, తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో పేర్కొన్నారు. 48 గంటల్లో కేటీఆర్‌కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని