KTR-Amit Shah: అమిత్‌ షా అబద్ధాలకు బాద్‌ షా.. ఆయనతో పావలా ప్రయోజనం లేదు: కేటీఆర్‌

తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలను దిల్లీ బాద్‌షాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం మునుగోడులో

Updated : 22 Aug 2022 21:11 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలను దిల్లీ బాద్‌షాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం మునుగోడులో అమిత్‌ షా ప్రసంగంతో మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. రూ.వేల కోట్లతో ఎమ్మెల్యేని కొన్నట్లుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి భాజపా ఖరీదు కడుతోందని ధ్వజమెత్తారు. అమిత్‌ షా అబద్ధాలకు బాద్‌ షా అని.. ఆయన ప్రసంగంలో అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలు లేవని కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

అమిత్ షా అలా అనడం సరికాదు..

‘‘మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు భాజపా ఓడిపోవడం ఖాయం. అమిత్‌ షాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజనం ఉండదు. నల్ల చట్టాలతో అన్నదాతల ఉసురు తీద్దామనుకున్న భాజపా నేతలు, రైతుల పక్షపాతి అయిన కేసీఆర్‌ను విమర్శించడాన్ని చూసి హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. విద్యుత్‌ చట్టాలతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్లే కుట్రలకు భాజపా ప్రభుత్వం తెరతీసింది. అనేక అంశాలపైన తెలంగాణ ప్రజలు అమిత్‌షా నుంచి స్పష్టతను ఆశించారు. అయితే, భాజపాకు అలవాటుగా మారిన తప్పించుకునే ధోరణినే అమిత్‌ షా కొనసాగించారు. దేశంలోని వ్యవసాయ రంగానికి నూతన దిక్సూచిగా అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అని అమిత్ షా అనడం సరికాదు. తెలంగాణ రైతుబంధు పథకాన్ని పేరు మార్చి పీఎం కిసాన్‌గా అమలు చేస్తున్న సంగతిని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తోన్న ప్రగతిని రోజుకో కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రశంసిస్తోన్న సంగతి అమిత్ షాకు తెలియకపోవడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం’’ అని కేటీఆర్‌ అన్నారు.

రూ. వేల కోట్ల కాంట్రాక్టులతో ఎమ్మెల్యేను కొన్న భాజపా.. మునుగోడుకు కోట్లాది రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తుందని అక్కడి ప్రజలు ఆశించారని కేటీఆర్‌ అన్నారు. గోల్ మాల్ గుజరాత్‌కు తప్ప గోల్డ్ మోడల్ తెలంగాణకు రూపాయి ఇచ్చే సంస్కారం ఆ పార్టీకి లేదని మండిపడ్డారు. అమిత్ షా లాంటి నాయకులు తెలంగాణ గడ్డపై అసత్యాలతో ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి అండగా నిలబడే తెరాసకే మద్దతుగా ఉంటారన్న విషయం మునుగోడు ఎన్నికతో అర్థం అవుతుందని కేటీఆర్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని