KTR: చేనేత రంగంపై మోదీ సర్కారు చిన్నచూపు: కేటీఆర్‌

తెలంగాణ చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగానికి కేంద్రం అందించాల్సిన సహాయం.....

Published : 06 Aug 2022 15:02 IST

హైదరాబాద్: తెలంగాణ చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపైన కేంద్ర చేనేత, ఔళి శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ఆయన లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగంపై మోదీ సర్కారు చిన్నచూపు చూపిస్తోందని లేఖలో ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నేతన్నల కడుపు కొడుతుందని మండిపడ్డారు. చేనేత రంగానికి సాయం చేశామంటూ ప్రధాని సహా కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని నేతన్నకు సహాయం చేస్తే మంచిదని హితవు పలికారు. నిజానికి చేనేత రంగం, ఆ రంగంలోని కార్మికులకు భాజపా ప్రభుత్వం నయాపైసా అదనపు సాయం చేయలేదని కేటీఆర్ ఆరోపించారు.

కేంద్రం సహాయం ఎక్కడ?

‘‘వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగ ప్రస్తుత దుస్థితికి కేంద్ర ప్రభుత్వ మతిలేని విధానాలే కారణం. అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏళ్ల నుంచి చేనేత రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం. ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోదీ సర్కారు టెక్స్‌టైల్‌ - చేనేత రంగంపై కూడా కక్ష కట్టింది. దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కేంద్రం సహాయం ఎక్కడ? మొన్న తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగంలో పేర్కొన్న మెగా టెక్స్‌టైల్ పార్క్ ఎక్కడ ఉందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సూమారు రూ.1,552 కోట్లతో తెలంగాణ ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో కేంద్రం తరపున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే.. ఇప్పటివరకు స్పందించలేదు. జాతీయ ప్రాధాన్యత కలిగిన మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేంద్రం సహకారం అందించాలి. దేశంలో చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ ఆగస్టు 7వ తేదీన జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి జీఎస్టీ పన్ను రద్దు చేయాలి’’ అని కేటీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని