ఆత్మనిర్భర్‌ భారత్‌ ఎక్కడ?: కేటీఆర్‌

ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీని పునర్‌ నిర్వచించి కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వీలైనంత ఎక్కువ

Updated : 17 Jun 2021 19:45 IST

హైదరాబాద్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీని పునర్‌ నిర్వచించి కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వీలైనంత ఎక్కువ చేయూత అందించేలా చూడాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు. 

‘‘కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి రూ.20లక్షల కోట్లతో ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికి ఏడాదిపైగా కావస్తోంది. అయితే, తెలంగాణలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నా’’ అని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా ఎంఎస్‌ఎంఈలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, 25 శాతానికి పైగా రాబడులు పూర్తిగా కోల్పోయాయన్నారు. ప్యాకేజీలో ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి గ్యారంటీడ్‌ ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ స్కీం కోసం రూ.3లక్షల కోట్లు కేటాయించారని, మార్గదర్శకాలు వెలువడ్డాక అందులో ప్రత్యేక ఆకర్షణ ఏమీ లేదని ఎంఎస్‌ఎంఈలు భావిస్తున్నాయని మంత్రి వివరించారు. 

ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను రూపొందించారని, దీంతో ఎంఎస్‌ఎంఈలు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఒక్కో యూనిట్‌ ఒక్కో విధమైన ఇబ్బంది, సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అన్ని ఎంఎస్‌ఎంఈలకు ఒకే రకమైన పథకం ద్వారా అవసరాలు తీరే అవకాశం లేదని, కరోనా సంక్షోభం ద్వారా కలిగిన నష్టాలను భరించేలా ఒక భారీ ఆర్థిక గ్రాంట్‌ ఇవ్వడం ద్వారా ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవచ్చని తాను భావిస్తున్నట్టు లేఖలో వివరించారు. ఏడాదికిపైగా సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఇవాళ్టికి కూడా సప్లై చైన్‌ డిస్ట్రిబ్యూషన్‌, లేబర్‌ కొరత, మారిన కస్టమర్ల ప్రాధాన్యతల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయన్న కేటీఆర్‌.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కూడా అంగీకరిస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, ఇన్నోవేటివ్‌ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన మరో రెండు పథకాలు దురదృష్టవశాత్తూ తెలంగాణలోనే కాకుండా, దేశంలో ఎక్కడా  ప్రారంభమైన పరిస్థితి లేదని అన్నారు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన సబార్డినేట్‌ డెబ్ట్ స్కీం అత్యంత తక్కువ రుణ మొత్తాన్ని అందిస్తోందన్న మంత్రి... సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల వయబిలిటీ పైనా స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్... కేంద్రం  ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్యాకేజీ విషయంలో ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని