KTR: సింగరేణి విషయంలో కుట్ర జరుగుతోంది: కేటీఆర్‌

సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా.. ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.

Updated : 20 Jun 2024 19:32 IST

హైదరాబాద్‌: సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా.. ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్‌ చెబితే..  వాటితో ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 16 ఎంపీ సీట్లు వచ్చిన తెదేపా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌కు చెరో 8 సీట్లు ఉన్నాయి. బొగ్గు గనుల వేలం పెట్టవద్దని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలీ లిగ్నెట్‌కు అప్పగించారు.

అలాగే గుజరాత్‌లో రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు 2015లో వేలం లేకుండానే నేరుగా నాలుగు గనులు కేటాయించారు. తమిళనాడులో కూడా బొగ్గు గనులను వేలం నుంచి మినహాయించాలని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై కేంద్ర మంత్రిని కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్లే నష్టాల్లోకి వెళ్లింది. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్ల అనే గనిని క్యాప్టివ్‌ మైన్‌ కింద కేటాయించాలని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అడిగితే కేంద్రం ఇవ్వలేదు. ఆప్షన్‌లో అదానీకి అప్పగించింది. సొంత గనిలేకపోవడంతో నష్టాల్లోకి వెళ్లిన విశాఖ ఉక్కును అమ్మాలని చూశారు. ఇప్పడు సింగరేణి విషయంలో కూడా అదే విధమైన వ్యూహం అలవంబించబోతున్నారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది. 2021 డిసెంబరు 11 నాడు సింగరేణికి కోల్‌ బ్లాక్స్‌ కేటాయించాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి వైఖరి ఎందుకు మారింది? వేలంలో పాల్గొంటామని ఇప్పుడు చెబుతున్నారు. తెలంగాణలోని బొగ్గు గనులు వేలం వేయకుండా ఇప్పటి వరకు భారాస రక్షణ కవచంలా నిలిచింది’’ అని కేటీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని