KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

పీఎం కేర్స్‌ ప్రభుత్వ నిధి కాదని.. పీఎం కేర్స్‌ కింద సేకరించిన విరాళాలు భారత ఏకీకృత నిధి (Consolidated Fund of India)కి వెళ్లవని పేర్కొంటూ దిల్లీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కేంద్రం ఇచ్చిన వివరణను ఆయన తప్పుబట్టారు.

Published : 01 Feb 2023 14:44 IST

హైదరాబాద్: పీఎం కేర్స్ ఫండ్‌ని (PM CARES Fund) పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌గా పేర్కొంటూ దిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తప్పుబట్టారు. భారత రాజ్యాంగం, పార్లమెంట్, ఏదైనా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ద్వారా పీఎం కేర్స్ ఫండ్ సృష్టించలేదని కేంద్రం దిల్లీ కోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వివరణపై ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్‌సైట్‌ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.  ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందనడానికి ఇదో క్లాసిక్ ఉదాహరణ’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పీఎం కేర్స్‌ (PM CARES)’ పేరుతో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పీఎం కేర్స్‌ నిధిని ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో సంయక్‌ గంగ్వాల్‌ అనే ఓ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక వేళ అది ప్రభుత్వ నిధి కాకుంటే వెబ్‌సైట్‌ డొమైన్‌ పేరులో gov, ప్రధానమంత్రి ఫొటో, కేంద్ర ప్రభుత్వ ముద్రను తొలగించాలని కోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్‌ విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ ద్వారా వివరణ ఇచ్చింది. ‘‘ఇది ప్రభుత్వ నిధి కాదు. పీఎం కేర్స్‌ కింద సేకరించిన విరాళాలు భారత ఏకీకృత నిధి (Consolidated Fund of India)కి వెళ్లవు. ఇతర ట్రస్టుల మాదిరిగానే ఈ ట్రస్టుకు వచ్చిన నిధుల వినియోగం పూర్తి పారదర్శకంగానే ఉంటుంది’’ దిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని