KTR: తెలంగాణ.. దోస్తుల కోసం పనిచేసే రాష్ట్రం కాదు: ఈటలకు కేటీఆర్‌ కౌంటర్‌

విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబించిన తీరునే సింగరేణి విషయంలోనూ అనుసరిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

Updated : 10 Feb 2023 17:39 IST

హైదరాబాద్: ఎవరో ఒకరి కోసమో.. లేదా దోస్తుల కోసమో పనిచేసే రాష్ట్రం తెలంగాణ కాదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) తేల్చి చెప్పారు. తెలంగాణ పరిశ్రమలకు అనుకూల రాష్ట్రమే తప్ప ఎవరో ఒక పారిశ్రామికవేత్తకు అనుకూల రాష్ట్రం కాదని స్పష్టం చేశారు. బడ్జెట్‌ పద్దులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సింగరేణి, గనుల కేటాయింపుపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Eatala rajenadar) అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని డిస్కంలకు గతంలో కేంద్రం లేఖలు రాసింది. దేశీయ బొగ్గును కొనుగోలు చేయొద్దు. తక్కువ ఖర్చుతో వస్తున్నప్పటికీ కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి బొగ్గును కొనాలని కేంద్రం ఆదేశించింది. నాలుగు రెట్లు విలువైన బొగ్గును కొనుగోలు చేయాలని చెప్పింది. ఎవరి కోసం.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఆదేశాన్ని జారీ చేసిందో భాజపా నేతలు చెప్పాలి. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా వెళ్తారు. ఆయన వెళ్లి వచ్చిన రెండు నెలల్లోనే ఆయన దోస్తులకు అక్కడి ప్రాంతంలోని బొగ్గుగని లీజు వస్తుంది. దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇక్కడ లేదు. కేంద్రం పరిధిలో ఉన్న కోల్‌ ఇండియా కంటే సింగరేణి మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. సింగరేణి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జెన్‌కో, బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు 91.6 శాతం పీఎల్ఎఫ్‌తో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ అంశంలో సింగరేణి వరుసగా ఆరు సార్లు కేంద్ర ప్రభుత్వ అవార్డు సాధించింది. ఒక వ్యక్తి కుబేరుడు అయితే దేశం బాగుపడుతుందని వారు (భాజపా నేతలు) భావిస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అలా అనుకోవడం లేదు.

సింగరేణి కాలరీస్‌ను ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఈటల రాజేందర్‌ చెబుతున్నారు. స్వయంగా ప్రధాని మోదీయే ఈ విషయం చెప్పారని అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ తుక్కు కింద అమ్మాలని చూస్తోంది ఎవరు? ఏ కారణం చేత విశాఖ ఉక్కును అమ్మాల్సి వస్తోంది? కేంద్రం ఒక విధానాన్ని అమలు చేస్తుంది. పరిశ్రమకు కావాల్సిన ముడి సరకు (విశాఖ విషయంలో ) గనులు కేటాయించకపోవడంతో నష్టాల్లోకి వెళ్లింది. కానీ, దివాళా తీసిందని చెప్పి ప్రైవేటుపరం చేసేస్తున్నారు. అదే వ్యూహాన్ని ఇవాళ సింగరేణి విషయంలోనూ కేంద్రం అనుసరించేందుకు ప్రయత్నించింది. గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు గనులు కేటాయించిన కేంద్రం.. సింగరేణికి ఎందుకు కేటాయించరు? మీకు (ఈటల రాజేందర్‌) చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించండి. సింగరేణికి ఎందుకు గనులు కేటాయించలేదని  నిలదీయండి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని