KTR: చేనేత రంగంపై ప్రధాని మోదీ నిర్ణయం అనాలోచితం: మంత్రి కేటీఆర్‌

ప్రధాని నరేంద్రమోదీ ఎందుకో చేనేత రంగంపై కత్తిగట్టినట్టు అనిపిస్తోందని.. ఈ 8 ఏళ్లలో చేనేత రంగంపై మోదీ ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ప్రధాన మంత్రుల్లో ఎవరూ చేయని ఒక ఆలోచన ప్రధాని మోదీ చేశారని పేర్కొన్నారు.

Updated : 10 Feb 2023 20:23 IST

హైదరాబాద్: భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ప్రజలకు ఉపాధి కల్పించే రంగం చేనేత అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బడ్జెట్‌ పద్దుపై చర్చలో భాగంగా చేనేత రంగం, కార్మికులపై పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత రంగానికి రూ.70 కోట్లు కేటాయించింది. ఇవాళ తెలంగాణ సర్కార్‌ ఈ రంగానికి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించడమే కాకుండా చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. అయితే, ప్రధాని నరేంద్రమోదీ ఎందుకో ఈ రంగంపై కత్తిగట్టినట్టు అనిపిస్తోంది. ఈ 8 ఏళ్లలో చేనేత రంగంపై మోదీ ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రధాన మంత్రుల్లో ఎవరూ చేయని ఒక ఆలోచన మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపైన 5 శాతం పన్ను విధించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఉపసంహరించుకోవాలని ఎన్ని ఉత్తరాలు రాసినా ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. 5 శాతం ఉన్న పన్నును 12శాతానికి పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, ఈ 5 శాతం పన్నును పూర్తిగా తీసేసి గతంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించాలి’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్‌ కోరారు.

చేనేతపై కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలివే..

* ఆల్‌ ఇండియా హ్యాండీక్రాప్ట్స్‌ బోర్డును రద్దు చేశారు.

* ఆల్‌ ఇండియా పవర్‌లూమ్‌ బోర్డును తీసేశారు. తద్వారా దాని కింద అనుబంధంగా పనిచేసే 8 టెక్స్‌టైల్‌ పరిశోధనా సంస్థలు నిర్వీర్యం అయ్యాయి.

* హైదరాబాద్‌లో ఉండే ఆల్‌ ఇండియా జూట్‌ బోర్డు కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తొలగించారు.

* చేనేత సహకార సంఘం సభ్యుల త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకంలో 4 శాతంగా ఉన్న కేంద్ర వాటాను రద్దు చేశారు.

* చేనేత కార్మికల కోసం ఉద్దేశించిన లాంబార్డ్‌ ఆరోగ్య బీమా, బుంకర్‌ బీమా యోజనా పథకాలను తీసేశారు.

* హౌస్‌ కమ్‌ వర్క్‌ షెడ్‌ పథకాన్ని రద్దు చేశారు.

* కేంద్రం మార్కెటింగ్‌ ఇన్‌సెంటివ్ పథకం నిబంధనలు మార్చేసి అందని ద్రాక్షలా మార్చేశారని కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు.

ప్రధానిని కలిసినా ఫలితం లేదు..

‘‘ఉమ్మడి ఏపీలో నెల్లూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఉండేది. రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు ఆ తరహా సంస్థ లేకుండా పోయింది. ఇక్కడి నేతన్నల భవిష్యత్తు, కొత్త తరం వారి కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరాం. సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. నేషనల్‌ టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కావాలని కోరినా స్పందన రాలేదు. ఒక మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను మంజూరు చేయాలని ఇప్పటికీ కోరుతూనే ఉన్నాం.

బండి సంజయ్‌ ఉన్నా వారికి ప్రయోజనం లేదు..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న లోక్‌సభ నియోజకవర్గంలోనే మూడు ప్రధాన (సిరిసిల్ల, కమలాపూర్‌, చొప్పదండి) చేనేత స్థావరాలు ఉన్నాయి. ఒక పార్టీ అధ్యక్షుడు ఆ ప్రాంతం నుంచి ఉన్నప్పటికీ అక్కడి చేనేత కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. కేంద్ర ప్రభుత్వం నేతన్నలకు వాతలు పెడుతూ వెళ్తుంటే.. తెలంగాణ సర్కారు పూర్తి స్థాయిలో గణాంకాలు సేకరించి అనేక కొత్త కార్యక్రమాలను తీసుకొచ్చింది. నూలు, రసాయనాల మీద దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం రాయితీ ఇచ్చేలా చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా కరోనా సమయంలో 26వేల చేనేత కుటుంబాలకు రూ.100 కోట్ల మేర లబ్ధిచేకూరింది’’ అని కేటీఆర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని