KTR: అన్నింటికీ కారణం నేషనల్‌ డిజాస్టర్‌ అలయన్సే..: కేటీఆర్‌ విమర్శలు

కేంద్ర ప్రభుత్వం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు.

Updated : 24 Jun 2024 20:27 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షల్లో అవకతవకలపై ‘ఎక్స్‌’ వేదికగా కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. విద్యార్థుల జీవితాలను అయోమయానికి గురిచేసేలా జరిగిన ఈ వరుస ఘటనలు దురదృష్టకరమన్నారు. ‘‘జూన్ 4న నీట్ - యూజీ పేపర్ లీక్ కాగా.. జూన్ 19న యూజీసీ - నెట్ పరీక్ష రద్దు చేశారు. జూన్ 21న సీఎస్ఐఆర్ - యూజీసీ - నెట్ పరీక్ష వాయిదా పడగా.. జూన్ 22న చివరి నిమిషంలో నీట్ - పీజీ పరీక్ష సైతం వాయిదా పడింది. భాజపా సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పొంతనలేకుండా ఉన్నాయి’’ అని మండిపడ్డారు.

నీట్‌-యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్‌ అయినట్లు రుజువైనా మోదీ ప్రభుత్వం జులై ఆరో తేదీ నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఎలాంటి కారణాలు చూపకుండా నీట్‌ - పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారని ఆక్షేపించారు. ఈ నిర్ణయాల వెనుక ఉన్న లాజిక్‌ ఏంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. అన్నింటికీ కారణం నేషనల్‌ డిజాస్టర్‌ అలయన్స్‌ అంటూ ఎన్డీయే సర్కారుపై విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని