KTR: ఆ లెక్కలు తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ చేసింది గుండు సున్నా అని, ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

Updated : 20 Apr 2022 22:20 IST

వరంగల్‌: తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ చేసింది గుండు సున్నా అని, ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు తెలంగాణ కోసం ఏనాడైనా మోదీని నేరుగా కలిశారా? అని ప్రశ్నించారు. హనుమకొండలో నిర్వహించిన కార్యకర్తల సభలో మాట్లాడిన కేటీఆర్‌.. ప్రధాని మోదీ, రాష్ట్ర భాజపా నేతలపై ఘాటైన విమర్శలు చేశారు.

‘‘హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ కేంద్రం వస్తుందని పది రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. అంతలోనే ఈ కేంద్రాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. దేశంలో 7 కేంద్ర సాంకేతిక సంస్థలు తెచ్చినా రాష్ట్రానికి వచ్చింది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా 16 ట్రిపుల్‌ ఐటీలు, 84 నవోదయ పాఠశాలలు, 2 ఐసర్‌లు.. ఇలా అనేక సంస్థలు వచ్చినా రాష్ట్రానికి ఒక్కటీ దక్కలేదు. రాష్ట్రం కేంద్రానికి ఎనిమిదేళ్లలో రూ. 3.65 లక్షల కోట్లు పన్నులు చెల్లిస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లు మాత్రమే. ఈ లెక్కలు తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేసి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా. గుండె నిబ్బరంతో రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌పై కొందరు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. పాలమూరులో పాదయాత్ర చేస్తూ పెద్ద మాటలు మాట్లాడుతున్న సంజయ్‌ అసలు కరీంనగర్‌కు ఏం చేశారో చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న తీరుగా ఈయన వ్యవహారం ఉంది’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని