KTR: భాజపా, కాంగ్రెస్‌ తోడుదొంగలు

తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు.

Published : 23 Jun 2024 04:27 IST

నదీజలాల అప్పగింత, గనుల వేలంతో రాష్ట్రానికి తీరని ద్రోహం
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్, భాజపా కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకుని రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ తాజాగా సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయడానికి కుట్రపూరితంగా భాజపాతో కుమ్మక్కైందని ఆయన శనివారం ‘ఎక్స్‌’లో విమర్శించారు. గనుల వేలంలో పాల్గొన్నందుకు రేవంత్‌రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా, వాటిని క్రూరంగా అణచి, వేలమందిని చంపిన పార్టీ. తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని భారాస ప్రభుత్వం, కేసీఆర్‌ వ్యతిరేకించినందువల్లే గతంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొంది. అప్పటి భారాస ప్రభుత్వ కఠినవైఖరి వల్లే రెండు కంపెనీలు ఇప్పటిదాకా ఇక్కడ నుంచి తట్టెడు బొగ్గు కూడా ఎత్తలేదు. మైనింగ్‌ ప్రారంభించలేదు. అవే రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లి-జెన-బెల్లోర గనులు చేజిక్కించుకుని మైనింగ్‌ చేశాయి. రాష్ట్రానికి మీరు, మీ జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ఎఫ్‌డీఐలో తెలంగాణ ఘనత

దేశంలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా తగ్గినప్పటికీ తెలంగాణ 130 శాతం వృద్ధితో పెట్టుబడులను సాధించిందని కేటీఆర్‌ శనివారం ‘ఎక్స్‌’లో తెలిపారు. ‘‘2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-2024లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా తెలంగాణ 130 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా...గుజరాత్‌ 55 శాతం, తమిళనాడు 12 శాతం అధిక పెట్టుబడులను సాధించాయి. అమెజాన్‌ సంస్థ వెబ్‌సేవల కోసం రూ.36,300 కోట్లు, మైక్రోసాఫ్ట్‌ రూ.16,000 కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణలో పెట్టడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. 2022-23లోనే ఈ పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. దీంతో 2023-24లో ఎఫ్‌డీఐల విషయంలో భారీవృద్ధి నమోదైంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు