KTR: కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు: కేటీఆర్‌

దేశానికే తలమానికంగా నిలిచేలా వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరంగల్‌లో మంత్రి

Updated : 07 May 2022 16:41 IST

వరంగల్‌: దేశానికే తలమానికంగా నిలిచేలా వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాక‌తీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్‌ వస్త్ర పరి‌శ్రమకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌ను టెక్స్‌‌టైల్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిందన్నారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో 20 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు చెప్పారు. వారిలో సింహభాగం మహిళలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. వరంగల్‌లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటు జరుగుతోందని వెల్లడించారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయని.. మరికొన్ని సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో వరంగల్‌ జిల్లాలోనే 50 వేల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు.

ఏఐసీసీ అంటే.. ఆలిండియా క్రైసిస్‌ కమిటీ...

‘‘తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొనే వారు ఎవరైనా ఉన్నారా? పొత్తు కావాలని కాంగ్రెస్‌ను ఎవరైనా అడిగారా? కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు. సొంత నియోజకవర్గంలో ఒక ఎంపీగా గెలవని రాహుల్‌.. ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? రాహుల్‌.. మీరు గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్‌ చదివారు. రైతుల ఆత్మహత్యలు తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఏఐసీసీ అంటే ఆలిండియా క్రైసిస్‌ కమిటీ. కాంగ్రెస్‌ పార్టీ గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయింది. నిన్న వరంగల్‌లో ప్రకటించిన డిక్లరేషన్‌లో ఏమైనా కొత్త అంశాలు ఉన్నాయా?2018లో చెప్పిన విషయాలనే నిన్న మళ్లీ చెప్పారు. ధాన్యం గురించి పార్లమెంటులో రాహుల్‌ ఏనాడైనా మాట్లాడారా?

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు లేదు.. నిరంతర విద్యుత్తు లేదు.. రైతు బీమా లేదు.. వలసలు లేని ఊరు లేదు.. ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలు ఏవీ కాంగ్రెస్‌ హయాంలో లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయాన్ని సంక్షోభంగా మారిస్తే.. కేసీఆర్ గొప్ప శక్తిగా మార్చారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ రైతులకు పాతర వేస్తే.. మేం తెలంగాణలో జాతర లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చాం. రుణమాఫీ చేయలేదంటారు.. వాస్తవాలు రైతులకు తెలియదా?రుణమాఫీ చేశామో లేదో అన్నదాతలకు తెలుసు. తెలంగాణలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్‌ పార్టీని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. వరంగల్‌ డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ నేతలు చెప్పిన మాటలు ఎవరూ విశ్వసించొద్దు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని