KTR: మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు: మంత్రి కేటీఆర్‌

ప్రధాని మోదీ వల్ల ఈదేశంలో బాగు పడింది అదానీ ఒక్కడేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధుల, భారాస నేతలు పాల్గొన్నారు.

Updated : 31 Jan 2023 18:24 IST

కరీంనగర్‌: ‘పార్టీ పేరు మాత్రమే మారింది కానీ డీఎన్‌ఏ, పార్టీ గుర్తు మారలేదు’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధుల, భారాస నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘14 నెలల కిందట జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. రూ.3వేల పింఛను ఇస్తామన్నారు, హోం మంత్రి అమిత్‌ షాను తీసుకొచ్చి నిధుల వరద పారిస్తామని ఆరోజు ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయి. ఈ 14 నెలల్లో హుజూరాబాద్‌లో ఏం అభివృద్ధి జరిగింది. కేసీఆర్‌ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఇటీవల ఈటల రాజేందర్‌ అన్నారు. ఈటల అనే వ్యక్తి ఉన్నాడని పరిచయం చేసింది సీఎం కేసీఆర్‌ కాదా? 2004లో తెరాస టికెట్ కోసం 33 మంది పోటీపడితే ఈటలకు టికెట్‌ ఇచ్చారు. ఈటలకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్‌. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్టు.. తండ్రి లాంటి కేసీఆర్‌ను పట్టుకుని కేసీఆర్‌ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఈటల మాట్లాడుతున్నారు.. ఇది తగునా? ఎవరి పాలన ఈ దేశానికి అరిష్టమో ప్రజలు ఒక్క సారి ఆలోచించాలి.’’ అని కేటీఆర్‌ అన్నారు.

ప్రధాని మోదీ వల్ల ఈదేశంలో బాగు పడింది అదానీ ఒక్కరేనని కేటీఆర్‌ అన్నారు.  ‘‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామన్నారు.. కానీ, చివరికి దేశ ప్రజల సంపదనంతా ఒక్కడి ఖాతాలోనే వేశారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. పెట్రోలు, డీజీల్‌పై పన్నుల రూపంలో ప్రజల నుంచి రూ.30లక్షల కోట్లు వసూలు చేశారు. అడబ్బంతా ఎక్కడికి పోయింది. ప్రజల పన్నులతోనే హైవేలు నిర్మిస్తే.. మరి టోల్‌ రుసుం ఎందుకు వసూలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లలో చేసిన అప్పు రూ.100 లక్షల కోట్లు. మోదీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పంచుతోంది. ప్రధాని మోదీ దేవుడని బండి సంజయ్‌ చెబుతున్నారు.. మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా తొక్కిపెట్టినందుకా? నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికిపైగా చేపట్టిన నిరసనల్లో 700 మంది రైతులు చనిపోయినందుకా? చేనేతలపై 5శాతం జీఎస్టీ విధించినందుకా? ఆకాశంలో అప్పులు, పాతాళంలో రూపాయి ఉన్నాందుకా? ఇందుకేనా ప్రధాని మోదీ దేవుడు? 14 మంది ప్రధానులు చేసిన అప్పులు మోదీ ఒక్కరే చేశారు. మతపరంగా రెచ్చగొట్టడం తప్పితే  ఈ జిల్లాకు బండి సంజయ్‌ ఏమైనా చేశారా? పరిశ్రమలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర విద్యాసంస్థలను బండి సంజయ్‌ తెచ్చారా? గుజరాతీల చెప్పులు నెత్తిన పెట్టుకునే వ్యక్తికి తెలంగాణ ఆత్మాభిమానం ఉంటుందా?’’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు